
స్కూలుకెళ్లే పిల్లలు పేచీ పెట్టడం ఎంత సహజమో, బతిమాలో, కోప్పడో వాళ్లను బడికి పంపడానికి పేరెంట్స్ యత్నించడం అంతే సహజం. కరోనా కారణంగా తాజాగా ఆన్‌లైన్ క్లాసుల హంగామా పెరిగిపోయింది. అయితే ఈ క్లాసులకు హాజరవుతున్న పిల్లలు నిజంగా ఆసక్తిగా ఉన్నారా? లేక బలవంతంగా అటెండ్ అవుతున్నారా? తెలుసుకునే టెక్నికల్ ప్లాట్‌ఫామ్‌ను సైంటిస్టులు అభివృద్ధి చేశారు. అయితే ఇది ఇంకా మన దగ్గర అందుబాటులోకి రాలేదు. క్లాస్ వర్క్‌కు పిల్లలు ఎలా స్పందిస్తున్నారు, ఆన్‌లైన్ క్లాసులను వినేందుకు ఎంత మేర ఆసక్తి చూపుతున్నారనే అంశాలను పరిశీలించాలన్న తలంపుతో హాంకాంగ్ టీచర్లు కృత్రిమ మేథస్సును ఆశ్రయించారు.
4 లిటిల్ ట్రీస్‌గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ను హాంకాంగ్‌కే చెందిన స్టార్టప్ కంపెనీ ఫైండ్ సొల్యూషన్ రూపొందించింది. దీని ద్వారా పిల్లల ముఖాల్లోని భావోద్వేగాన్ని కృత్రిమ మేథ గుర్తించి విశ్లేషిస్తుంది. పిల్లలు చదివే సమయంలో వారి ముఖాలపై కండరాల స్థానాలను కెమెరాతో క్యాప్చర్ చేసి అనంతరం భావోద్వేగాల విశ్లేషణ చేపడతుంది. అలాగే ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు స్టూడెంట్ తీసుకునే సమయం, వారి మార్కులు, వారి బలాలు బలహీనతలను ఈ కృత్రిమ మేథస్సు పర్యవేక్షిస్తుంటుంది. కేవలం పిల్లలను అధ్యయనం చేయడమే కాకుండా వారి ప్రదర్శన మెరుగుపడేందుకు అవసర చిట్కాలను అందిస్తుంది. 4 లిటిల్ ట్రీస్‌ను వాడిన తర్వాత పలు మంది పిల్లల ప్రదర్శనలో మంచి మార్పులు కనిపించాయని టీచర్లు చెబతున్నారు.
స్వేచ్ఛపై సందేహాలు
అలాగని ఈ టెక్నాలజీపై అంతా సంతోషంగా ఉన్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. సాంకేతికత వాడకం పెరిగితే పిల్లల స్వేచ్ఛకు భంగకరమని పలువురు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అలాగే ప్రైవసీ డేటాపై సైతం ఆందోళన చెందుతున్నారు. కానీ తమ సాఫ్ట్‌వేర్ కేవలం విశ్లేషణకు ముఖ కండరాల కదలికలను అధ్యయనం చేస్తుంది కానీ ఎలాంటి వీడియోలు తీయదని కంపెనీ తెలిపింది. మరోవైపు గాఢమైన నలుపు వర్ణం ఉన్న పిల్లల ముఖ కవళికలను గుర్తించడంలో ఈ సాఫ్ట్‌వేర్ సమస్యలు ఎదుర్కోవడం జాతి వివక్ష అంశాన్ని తెరమీదకు తెస్తోంది. అయితే సాఫ్ట్‌వేర్ ఉత్పత్తిలో స్థానిక పిల్లల ముఖకవళికలు వాడుకోవడంతో ఈ సమస్య వచ్చిందని, అప్‌గ్రేడ్ చేసే సమయంలో దీన్ని సరిచేయవచ్చని కంపెనీ భరోసా ఇస్తోంది. సో, మొత్తం మీద పిల్లల ముఖం చూసి మూడ్ కనిపెట్టే ఈ సాఫ్ట్‌వేర్ త్వరలో అన్నిదేశాలకు అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment