
వ్యక్తిగత జీవితాలు, వ్యవస్థలు, ప్రభుత్వాలకు సైతం ‘సైబర్’ ముప్పు
పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సైబర్ హైజీన్‌ను అలవాటు చేయాలి
ఇప్పటివరకు ఆధార్ హ్యాకింగ్ సమస్యే తలెత్తలేదు
చిన్నారులపై నేరాల నియంత్రణకు కఠిన శిక్షలే మార్గం
షీల్డ్–2025 సదస్సులో నిపుణుల ఉపన్యాసాలు
సాక్షి, హైదరాబాద్: సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు తీసు కోవాల్సిన చర్యలపై చర్చించేందుకు, నూతన సాంకేతిక తలను రూపొందించే లక్ష్యంతో హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన షీల్డ్–2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలిరోజు జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ మునైర్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మాజీ చైర్మన్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ కీలక ఉపన్యాసాలు చేశారు.
సైబర్ ప్రొఫెషనల్స్‌కు మంచి భవిష్యత్తు: లెఫ్టినెంట్ జనరల్ మునైర్
‘సైబర్ భద్రత అనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఇది ప్రతి నిత్యం మారుతూనే ఉంటుంది. ఇప్పుడు మన జీవితాలన్నీ డిజిటల్ కనెక్టివిటీతో ముడిపడి ఉన్నాయి. వ్యక్తిగత జీవితాలు మొదలు, వ్యవస్థలు, ప్రభుత్వాలకు సైతం సైబర్ నేరగాళ్లతో ముప్పు పొంచి ఉంది. కాబట్టి సైబర్ భద్రత నిపుణులకు మంచి భవిష్యత్తు ఉంది. సైబర్ భద్రత రంగానికి చెందిన భాగస్వాములందరూ ఒకే వేదికపైకి వచ్చిన పలు అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది.
అప్పుడే భవిష్యత్తులో సురక్షితమైన వ్యవస్థలు రూపొందించగల్గుతాం. ఈ క్రమంలో నూతన ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సైబర్ హైజీన్‌ను అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పాఠశాలల బోధనా ప్రణాళికల్లోనూ సైబర్ భద్రతను భాగం చేయాలి..’ అని జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ మునైర్ చెప్పారు.
అత్యంత సురక్షితంగా ఆధార్ డేటా: ట్రాయ్ మాజీ చైర్మన్ శర్మ
‘సాఫ్ట్‌వేర్ డిజైన్ల తయారీలో ప్రైవసీ, సెక్యూరిటీ అన్నవి అత్యంత ప్రధానాంశాలు. నేను ఆధార్ మిషన్ డైరెక్టర్‌గా పనిచేశా. ఆధార్ సాఫ్ట్‌వేర్ డిజైన్ల తయారీ తర్వాత మొదటి ఆధార్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు 15 నెలల సమయం తీసుకున్నాం. ఇప్పుడు దేశంలో 1.4 బిలియన్ ఆధార్‌లు ఉన్నాయి. అయినా ఇప్పటివరకు ఒక్క ఆధార్ కార్డు డేటా కూడా హ్యాక్ కాలేదు. అంత సురక్షితంగా ఆధార్‌ను రూపొందించాం. అదే విధంగా కోవిన్ యాప్‌లోనూ 2.4 బిలియన్ రికార్డులు ఉన్నాయి. ఆ డేటా కూడా ఎంతో సురక్షితంగా ఉంది..’ అని ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. ‘ప్రైవసీ బై డిజైన్–సెక్యూరిటీ బై డీఫాల్ట్ ’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు.
లైంగిక నేరగాళ్ల డేటాబేస్ ఏర్పాటు చేయాలి: భువన్ రిభు
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కూడా చిన్నారులపై లైంగిక దాడుల వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్నారు. ఇది అత్యంత క్రూరం. కృత్రిమ మేధస్సును వాడి చేస్తున్న ఈ క్రూర నేరాలకు దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా తక్షణ శిక్షలు విధించడం అవసరం. అంతర్జాతీయ స్థాయిలో చట్టాలను సమన్వయం చేయడానికి, నిఘా భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి వీలుగా అంతర్జాతీయ లైంగిక నేరస్థుల డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలి. చిన్నారులపై లైంగిక వేధింపులు అరికట్టాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లో వేధింపులపైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. చిన్నారులపై వేధింపులకు పాల్పడే వారు ధైర్యంగా బయట తిరుగుతుండడం బాధాకరం..’ అని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment