ప్రతి నెల మొదటి రోజు ప్రారంభంతో ఆర్ధికపరమైన మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలో సైతం ఈ మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా రూ.2,000 నోట్ల డిపాజిట్లు.. ఎక్ఛేంజ్, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆధార్ నెంబర్‌ను జత చేయడం, ఉచితంగా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు. వీటితో పాటు..
రూ.2,000 ఎక్ఛేంజ్‌కు చివరి రోజు
ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ రూ.2,000 నోట్ల ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రజలు 2023 సెప్టెంబర్ 30 వరకు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. మే 23 నుంచి ఏదైనా బ్యాంకు శాఖను సందర్శించి ఈ నోట్లను మార్చుకోవచ్చని ఒక ప్రకటనలో చెప్పింది. అయితే, జులై 20న ప్రారంభమైన లోక్‌సభ సమావేశాల్లో నోట్ల మార్పిడి గడువు పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో నోట్ల ఉపసంహరణకు ఆర్‌బీఐ 4నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే రూ.2,000 నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది.
ఆధార్ నంబర్ తప్పని సరి
కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31 నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన చందాదారులకు నో యువర్ కస్టమర్ (కేవైసి)ని అప్‌డేట్ చేయడానికి ఆధార్ నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆ గడువు సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలల గడువు ఇచ్చింది. పొదుపు దారులు ఆధార్‌ను నెంబర్‌ను జత చేయకపోతే అక్టోబర్ 1నుండి పెట్టుబడులను కొనసాగించడం అసాధ్యం
ట్రేడింగ్ చేయాలంటే తప్పని సరిగా
సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్చి నెలలో స్టాక్ మార్కెట్‌లో ఇప్పటికే ట్రేడింగ్ నిర్వహిస్తున్న ( existing holders) వారు తప్పని సరిగా వారి డిమ్యాట్ అకౌంట్‌కు ఒక లబ్దిదారుని వివరాల్ని జత చేయాల్సి ఉంటుంది. ఆ గడువు తేదీ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంది.
ఉచితంగా ఆధార్ అప్‌డేట్
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జూన్ నెలలో ఆధార్‌లో ఏదైనా మార్పులు చేర్పులను ఉచితంగా చేసుకోనే గడువును పొడిగించింది. ఆ గడువు సెప్టెంబర్ 14 మాత్రమే ఉందని ఆధార్ ట్వీట్ చేసింది.
యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ నిబంధనలు - షరతులు
సెప్టెంబరు 1 నుండి యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వార్షిక రుసుము రూ. 10,000 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 12,500 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.10,000 విలువైన వోచర్ బెన్ఫిట్స్‌ను నిలిపివేస్తుంది. రూ. 1,00,000 నెలవారీ ఖర్చులపై 25,000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్‌ల నెలవారీ ప్రయోజనాల్ని సైతం నిలిపివేస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.
సీనియర్ సిటిజన్ల కోసం (SBI WeCare FD)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కోసం గడువును పొడిగించింది. ఎస్‌బీఐ వీకేర్ పథకంలో 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిలో పెట్టుబడి దారులైన సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక ఈ పథకంలో చేరే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ
ఐడీబీఐ బ్యాంక్ తన ప్రత్యేక పిక్స్‌డ్ డిపాజిట్ పథకం అమృత్ మహోత్సవ్ లో చేరే గడువు పొడిగించిన విషయం తెలిసిందే. రెండు టెన్యూర్‌ల కాలానికి 7.10శాతం నుండి 7.65 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. గడువు తేదీ సైతం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు సాధారణ వ్యక్తులతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు పొందుతారు.
చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’
Comments
Please login to add a commentAdd a comment