చైనాకు కలిసొస్తున్న కరోనా..! | Chinas Imports, Exports Were Soaring First 2 Months Of 2021 | Sakshi
Sakshi News home page

చైనాకు కలిసొస్తున్న కరోనా..!

Published Sat, May 8 2021 12:00 AM | Last Updated on Sat, May 8 2021 2:18 PM

Chinas Imports, Exports Were Soaring By 32.2% In First 2 Months Of 2021 - Sakshi

అమెరికాసహా పలు దేశాల్లో రికవరీ, డిమాండ్‌ పటిష్టంగా ఉండడంతో ప్రపంచ పటంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా దీనిని తనకు పూర్తి అనుకూలంగా మార్చుకుంటోంది. చైనాతో పోటీ పడుతున్న పలు దేశాలు కరోనా సెకండ్‌ వేవ్‌ సవాళ్లలో కూరుకుపోవడం దీనికి నేపథ్యం. చైనా ప్రపంచ ఎగుమతులు ఏప్రిల్‌లో (2021 ఇదే కాలంతో పోల్చి) ఏకంగా 32.3 శాతం పెరిగాయి. విలువలో 263.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు సైతం 43.1 శాతం పెరిగి 221.1 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చైనా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌ ఎగుమతులు 24.1 శాతం అంచనాలకు మించి పెరగడం గమనార్హం. మార్చిలో వృద్ధి రేటు 30.6 శాతం. ఇక దిగుమతుల విషయానిక వస్తే, మార్చిలో పెరుగుదల రేటు 38.1 శాతం.  

అమెరికా, ఈయూలతో వాణిజ్యం ఇలా... 
ఇక ఒక్క అమెరికాకు ఏప్రిల్‌లో చైనా ఎగుమతుల విలువ 38.8 శాతం పెరిగి 42 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అమెరికా గూడ్స్‌ దిగుమతుల విలువ 23.5 శాతం పెరిగి 13.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌కు ఎగుమతులు 23.9 శాతం పెరిగి 39.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల విలువ 43.3 శాతం పెరిగి 26.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  చైనా ప్రపంచ వాణిజ్య మిగులు  42.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే చైనా వస్తు డిమాండ్‌ మెరుగుపడిందని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. ముడి ఇనుము, ఇతర కమోడిటీ ధరలు అంతర్జాతీయంగా పెరగడం కూడా చైనా ఎగ్జిమ్‌ (ఎగుమతులు–దిగుమతులు) డిమాండ్‌కు సానుకూలత చేకూర్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోవిడ్‌–19 నేపథ్యంలో ఇతర దేశాలతో పోల్చితే చైనా ఎకానమీ ముందే ప్రారంభంకావడం గమనార్హం. మాస్కులు, ఇతర వైద్య సంబంధ ఎగుమతులు చైనా నుంచి భారీగా పెరిగాయి.  

కంటైనర్లకు అదనపు ప్రీమియంలు 
తమ దేశం నుంచి ప్రపంచ దేశాలకు భారీగా ఎగుమతులు పెరగడానికి చైనా వినూత్న విధానాలను  చేపడుతోందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ వార్తల ప్రకారం భారత్‌ వంటి పలు దేశాలఎగుమతుల్లో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదుకావడానికి కంటైనర్ల కొరతే ప్రధాన కారణం. ఫిబ్రవరి చివరి వారంలో విపరీతమైన కంటైనర్ల కొరత ఏర్పడింది. ‘‘ఈ ప్రాంతంలో కంటైనర్ల కొరత ఉండడం ఇక్కడ ఒక సమస్య. చైనా నుంచి భారీ ఎగుమతుల కోసం ఖాళీ కంటైనర్లు ఆ దేశానికి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయి. ఇలా ఖాళీ కంటైనర్లు చైనాకు తిరిగి వెళ్లడానికి షిప్పింగ్‌ లైన్స్, కంటైనర్‌ కంపెనీలకు చైనా అధిక ప్రీమియంలనూ చెల్లిస్తోంది’’ అని ఎఫ్‌ఐఈఓ (భారత ఎగుమతి సంఘాల సమాఖ్య)  ప్రెసిడెంట్‌ ఎస్‌కే షరాఫ్‌ ఇటీవల పేర్కొనడం గమనార్హం.  

ఏప్రిల్‌లో భారత్‌ ఎగుమతి–దిగుమతులు... 
భారత్‌ ఎగుమతులు 2021 ఏప్రిల్‌లో  30.21 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే కాలంలో దిగుమతుల విలువ 45.45 బిలియన్‌ డాలర్లుగా ఉంది.   

వృద్ధి బాటన అడుగులు.. 
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, వర్థమాన, పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా వైరస్‌ సవాళ్లతో అతలాకుతలం అవుతుంటే, వైరెస్‌ సృష్టికి కారణమైన చైనా మాత్రం పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. 2020 తొలి త్రైమాసికం మినహా మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం.  కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్‌)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును  నమోదుచేసుకుంది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్‌ డాలర్లు) నమోదుచేసుకుంది.  అయితే గడచిన 45 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో దేశం వృద్ధి రేటు నమోదుకాలేదు.

ఇక 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) అమెరికా తరువాత రెండవ అతిపెద్ద ఎకానమీ అయిన చైనా, ఏకంగా 18.3 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది.  విలువలో 24.93 ట్రిలియన్‌ యువాన్‌ (దాదాపు 3.82 ట్రిలియన్‌ డాలర్లు)లుగా నమోదయ్యింది. 1993లో చైనా జీడీపీ గణాంకాల ప్రచురణ ప్రారంభమైంది. అటు తర్వాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి రేటు (18.3 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక 2021లో దేశ ఎకానమీ పదేళ్ల గరిష్ట స్థాయిలో 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని ఈ నెల మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. చైనా ప్రభుత్వం మాత్రం 6 శాతం వృద్ధి లక్ష్యంతో పనిచేస్తోంది. మరోవైపు సెకండ్‌వేవ్‌ సవాళ్లలో పీకల్లోతు కూరుకుపోయిన భారత్‌ 2021, 2021–22 వృద్ధి అంచనాలకు భారీగా కోత పడుతోంది. 10 శాతం దిగువకే వృద్ధి రేటు పరిమితం అవుతుందని ఇప్పటికే దిగ్గజ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. దీనికీ బేస్‌ ఎఫెక్ట్‌ ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement