
పనాజీ: వచ్చే పదేళ్ల వ్యవధిలో 1,000 మెగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ సంస్థ అదానీకనెక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ భూటాని తెలిపారు. తొలి ఏడు డేటా సెంటర్లను ఆరు నగరాల్లో (హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పుణె) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం పరిశ్రమ స్థాయి 550 మెగావాట్లుగా ఉంది. మేము 1,000 మెగావాట్ల డేటా సెంటర్లు నిర్మించబోతున్నాం.
వచ్చే దశాబ్ద కాలంలో వీటిని ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం‘అని 9.9 గ్రూప్ సీఐవో, లీడర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా భూటాని తెలిపారు. ఆరు నగరాల్లో వచ్చే మూడేళ్లలో నెలకొల్పే తొలి ఏడు డేటా సెంటర్ల సామర్థ్యం 450 మెగావాట్లుగా ఉంటుందన్నారు. మిగతా 550 మెగావాట్ల సెంటర్లను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఎడ్జ్‌కనెక్స్‌తో కలిసి అదానీ ఎంటర్‌ప్రైజెస్ గతేడాది ఫిబ్రవరిలో చెరి సగం వాటాలతో అదానీకనెక్స్‌ను ఏర్పాటు చేసింది.
డేటా సెంటర్లకు కేంద్రం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇవ్వడం, ఏడు రాష్ట్రాలు ఇప్పటికే పాలసీ రూపొందించడం తదితర అంశాలు కంపెనీకి కలిసిరాగలవని భూటాని తెలిపారు. భారత్‌లో 550 మెగావాట్ల డేటా సెంటర్లు ఉన్నప్పటికీ చాలా మటుకు డేటా హోస్టింగ్ దేశానికి వెలుపలే ఉంటోందన్నారు. భారత్‌ను అంతర్జాతీయ డిజిటల్ హబ్‌గా మార్చాలంటే ఇతర దేశాల డేటాను కూడా దేశీయంగా హోస్ట్ చేసే సామర్థ్యాలు సాధించాల్సిన అవసరం ఉందని భూటాని చెప్పారు. వినియోగించే విద్యుత్ ప్రాతిపదికన డేటా సెంటర్ సామర్థ్యాన్ని లెక్కిస్తారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ అరిజ్‌టోన్ అంచనాల ప్రకారం 2021లో భారత డేటా సెంటర్ మార్కెట్ పరిమాణం 447 మెగావాట్లుగా, విలువపరంగా 10.9 బిలియన్ డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment