దేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీకి శ్రీలంక ప్రభుత్వం తాత్కాలిక అనుమతులిచ్చింది. దీంతో అదానీ సంస్థ ప్రాజెక్ట్‌ల నిర్మాణాల నిమిత్తం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది
గతేడాది అక్టోబర్‌లో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ శ్రీలంక తీర ప్రాంతాలైన మన్నార్, జాఫ్నా, కిలినోచీలో పర్యటించారు. అనంతరం నాటి ప్రధాని గోటబయ రాజపక్సతో పెట్టుబడులపై చర్చించారు. రెండు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై శ్రీలంక ప్రభుత్వం, అదానీ గ్రూపు ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో 286 మెగావాట్లు, 234 మెగావాట్ల రెండు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల కోసం అదానీ గ్రీన్ ఎనర్జీకి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాత్కాలిక అనుమతినిచ్చినట్లు శ్రీలంక విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర ప్రకటించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై చర్చించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ), సస్టైనబుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో సమావేశమైనట్లు విజేశేకర ట్వీట్‌లో తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మన్నార్ జిల్లా, కిలినుచ్చి జిల్లాలోని పూనేరిన్‌లలో ప్రారంభం కానున్నట్లు చెప్పారు.
'పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు సీఈబీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కాంచన విజేశేఖర భేటీ అయ్యారు. భేటీ అనంతరం మన్నార్‌లో 286 మెగావాట్లు, పూనేరిన్‌లో 234 మెగావాట్ల ఇంధన ప్రాజెక్ట్‌ల కోసంఅదానీ గ్రీన్ ఎనర్జీకి తాత్కాలిక అనుమతులు జారీ చేసినట్లు విజేశేఖర తెలిపారు. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేలా గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టుకునే అవకాశాన్ని అదానీ గ్రూప్‌కు కల్పించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment