మార్కెట్‌ ర్యాలీ మిస్సయ్యారా? | Advices For Who Missed The Market Rallies | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ర్యాలీ మిస్సయ్యారా?

Published Mon, May 31 2021 1:23 AM | Last Updated on Mon, May 31 2021 11:07 AM

Advices For Who Missed The Market Rallies - Sakshi

గతేడాది కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన తర్వాత నెల రోజులకు ఈక్విటీ మార్కెట్లు పాతాళానికి పడిపోయాయి. అక్కడి నుంచి ఏడాది తిరిగేసరికి ఈక్విటీ మార్కెట్లు మళ్లీ శిఖర స్థాయిలకు చేరుకున్నాయి. చారిత్రకంగా చూస్తే సంక్షోభంలోనూ ఇంత బలమైన బుల్‌ ర్యాలీ అన్నది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇదేనట. ఈక్విటీ మార్కెట్లు అంటేనే అస్థిరతలకు నిలయం. అందుకే ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకునే స్టాక్స్‌ సవాళ్లకు, సంక్షోభాలకు కుదేలై పోకుండా గట్టిగా ఎదుర్కొని మళ్లీ ప్రగతి దిశగా ప్రయాణించే సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తు అంచనాల ఆధారంగానే చలిస్తుంటాయి. కనుక ప్రస్తుత ఆర్థిక అంశాలపై కాకుండా దేశ వృద్ధి చక్రం త్వరలోనే రెండంకెల స్థాయికి పరుగెడుతుందన్న అంచనాలు ర్యాలీకి మద్దతుగా నిలిచే అంశమని విశ్లేషణ. ఏడాది కాలంలో కరోనా పూర్తి నియంత్రణలోకి వస్తుందని.. ఆ తర్వాత వృద్ధి వేగాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అస్థిరతలకు చలించిపోకుండా, గట్టిగా నిలబడే కంపెనీలు ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో ఉండడం ఎంతైనా అవసరం. అంటే.. బేర్‌ మార్కెట్లో పడిపోకుండా ఉండే స్టాక్స్‌ అని కాదు అర్థం. బేర్‌ మార్కెట్‌ తర్వాత వచ్చే బుల్‌ పరుగులో బలంగా పాల్గొనే సత్తా వాటికి ఉండాలన్నది విశ్లేషకుల సూచన. అందుకు ఏం చేయాలన్నది తెలియజేసే ప్రాఫిట్‌ప్లస్‌ కథనం ఇది.. 

చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు యావరేజ్‌ చేస్తుంటారు. అంటే ఒక స్టాక్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. అది పడిపోతూ ఉంటే ధరలు ఆకర్షణీయంగా అనిపించి మరికొంత మొత్తం పెట్టుబడి పెడుతూ వెళతారు. దీంతో తెలియకుండానే ఒక్క స్టాక్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పోగుపడతాయి. మరి నిజంగా ఆ కంపెనీ తిరిగి పూర్వపు స్థాయికి చేరుకోకపోతే..? మరింత పతనమై అలాగే ఉండిపోతే..? రిటైల్‌ ఇన్వెస్టర్‌ ఈ విధంగా ప్రశ్నించుకుని వివేకంతో పెట్టుబడులు పెడితేనే లాభాలు అందుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. యావరేజ్‌ విషయమై ప్రాచుర్యంలో ఉన్న కథనం కూడా ఒకటి ఉంది. ఒక స్టాక్‌ను బుల్‌ మార్కెట్లో మూడు అంకెల్లో ఉండగా కొనుగోలు చేసి.. బేర్‌ మార్కెట్లో రెండంకెల స్థాయికి పడిపోయిన తర్వాత యావరేజ్‌ చేసి తదుపరి బుల్‌ మార్కెట్లో.. ఒక అంకె ధరలో (రూ.10కు దిగువన) విక్రయించినట్టుగా ఉంటుంది యావరేజ్‌ చేయడం.

బలమైన, పటిష్టమైన ఆర్థిక మూలాలు ఉండి, వ్యాపార పరంగా మోట్‌ (పోటీలేని) కలిగి ఉన్న వాటిని తక్కువ ధరల్లో యావరేజ్‌ చేయడం కొంత వరకు సరైనదే అని చెప్పుకోవచ్చు. అది కూడా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యల్లేకుండా.. కేవలం తాత్కాలిక పరిణామాల వల్ల ధరల్లో దిద్దుబాటు వస్తే యావరేజ్‌ను అవకాశంగా చూడొచ్చు. కానీ, కారణం తెలియకుండా యావరేజ్‌ చేయడం వల్ల లాభం కంటే నష్టాలకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా యావరేజ్‌తో ఉన్న పెద్ద ప్రతికూలత పెట్టుబడులన్నీ కేవలం కొన్ని స్టాక్స్‌లోనే ఎక్కువగా పోగవడం. ఒక్కోసారి యావరేజ్‌ చేసేందుకు పెట్టుబడుల్లేక.. తమ పోర్ట్‌ఫోలియోలో లాభాలు చూపిస్తున్న స్టాక్స్‌ను విక్రయించేసే వారు కూడా ఉన్నారు. బంగారు గుడ్లు పెట్టే బాతును కోసిన చందమే అవుతుంది ఇది.  

బుల్‌ మార్కెట్‌ ముగిసి బేర్‌ మార్కెట్లోకి ప్రవేశించినట్టయితే.. అప్పటి వరకు ఎదురేలేదు అనుకున్న కంపెనీలు కనిపించకుండా పోవచ్చు. జేపీ అసోసియేట్స్, యూనిటెక్, అడాగ్‌ గ్రూపు కంపెనీలైన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, రిలయన్స్‌ పవర్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, సుజ్లాన్‌ ఇలా చెప్పుకునేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిఫ్టీ స్టాక్‌ యస్‌ బ్యాంకు పతనం గుర్తుండే ఉంటుంది. యస్‌ బ్యాంకు రాణా కపూర్‌ సారథ్యంలో మరింత ముందుకు వెళుతుందని, రూ.2,000 వరకు స్టాక్‌ వెళ్లొచ్చన్న అంచనాతో ఇన్వెస్ట్‌ చేసిన వారూ ఉన్నారు. రూ.400 స్థాయి నుంచి యస్‌ బ్యాంకు స్టాక్‌ ధర క్రమంగా పడిపోతూ ఉంటే.. రూ.200–300 మధ్య తిరిగి పెద్ద ఎత్తున యావరేజ్, కొనుగోలు చేసిన వారు గణనీయంగా ఉన్నారు. అంతేకాదు అక్కడి నుంచి రూ.12 స్థాయి వరకు యావరేజ్‌ చేస్తూ మరింత పెట్టుబడులు పెట్టిన వారున్నారు. జియోడెసిక్, తులిప్‌ టెలికం, ఎడ్యుకాంప్, ఎవరాన్, కరుతూరి గ్లోబల్, ఐవీఆర్‌సీఎల్‌ ఇలా ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించేసిన స్టాక్స్‌ బండెడున్నాయి.


కేటాయింపుల్లో పరిమితులు
ఒక్కో రంగం ఒక్కో కాలంలో గణనీయంగా ర్యాలీ చేస్తుంటుంది. 2005–2007 కాలంలో ఇన్‌ఫ్రా, విద్యుత్‌ కంపెనీలు భారీ ర్యాలీ చేశాయి. మళ్లీ ఆ స్థాయి ర్యాలీ ఇంత వరకు వాటిల్లో చూడలేదు. 2008 కరెక్షన్‌కు ముందు విద్యుత్, ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఇప్పటికీ లాభాలు వచ్చిన దాఖలాలు లేవు. కనుక ఈ తరహా ర్యాలీలను ముందుగా అంచనా వేసి ఇన్వెస్ట్‌ చేయగలిగితే గణనీయమైన రాబడులను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనదేశంలో రానున్న కాలంలో విద్యుత్‌ వాహనాల మార్కెట్‌ భారీగా వృద్ధి చెందుతుందన్న అంచనాలున్నాయి. ఇదే అంచనాతో కొన్నేళ్ల క్రితం టెస్లా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ఇప్పుటికే కోటీశ్వరులయ్యారు. కానీ టెస్లా స్టాక్‌ బంపర్‌ ర్యాలీ చేయడానికి ముందు పలు పర్యాయాలు దివాళా అంచుల వరకు వెళ్లొచ్చిన సంగతి ఎంత మందికి తెలుసు? అందుకే తొలి దశలోనే భవిష్యత్తు విజేత ఎవరన్నది గుర్తించడం కొంచెం కష్టం.

ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియోలో మీ ప్రతిభ కారణంగాను లేదా అదృష్టం కొద్దీ మల్టీబ్యాగర్‌ స్టాక్‌ను కొనుగోలు చేసి ఉన్నారనుకోండి.. ఆ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎంతో వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని నిపుణులు ఘంటా పథంగా చెబుతుంటే.. ఎగువ వైపున యావరేజ్‌ చేయడం మంచిదే అవుతుంది. అది కూడా మీరు గతంలో కొనుగోలు చేసిన ధరకు కొంచెం సమీపంలో ఉంటేనే. మీ కొనుగోలు ధరపై అప్పటికే 10 రెట్లు, 20 రెట్లు పెరిగిన తర్వాత మరో 100 శాతం, 200 శాతం వృద్ధి కోసం యావరేజ్‌ చేయడం కంటే ఆ పెట్టుబడులను అలాగే కదపకుండా కొనసాగించడం సరైనది. ఎందుకంటే అంత పెరిగిన తర్వాత పనితీరు అంచనాలు కొంచెం తేడా వచ్చినా స్టాక్‌లో దిద్దుబాటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే రిస్క్‌ను బట్టి ఇన్వెస్టర్లు అడుగులు వేయాలి.  

ఇన్వెస్టర్లు తగినంత అధ్యయనం తర్వాతే స్టాక్‌లో ఒకే విడత పెట్టుబడులు పెట్టాలి. లేదా ఫలానా స్టాక్‌లో రూ.10వేలు ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించుకుంటే.. ఐదు నుంచి పది విడతల్లో రూ.1,000–2,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లి అంతటితో ఆగిపోవాలి. ఒకటికి మించిన విడతల్లో కొనుగోలుకు నిర్ణయించుకున్నట్టయితే.. ఫండమెంటల్స్‌ మారనంత వరకు స్టాక్‌ ధర ఏ స్థాయిలో ఉన్నా పట్టించుకోవక్కర్లేదు. అంతేకానీ, ముందుగా నిర్ణయించుకున్న పరిమితిని మించి యావరేజ్‌లు చేయకూడదు. దీనివల్ల ఒక స్టాక్‌లో పెట్టుబడి రూ.10వేలకు పరిమితం అవుతుంది. మీ అంచనాలు నిజమై, కంపెనీ మంచి వృద్ధినే చూపిస్తే చక్కని రాబడులు సొంతం అవుతాయి. ఒకవేళ అంచనాలు తప్పి కంపెనీ పనితీరు బాగోలేక స్టాక్‌లో పతనం వచ్చిందనుకుంటే ఆ నష్టం పరిమితమవుతుంది. అందుకే ఇన్వెస్టర్‌ తనవద్దనున్న మొత్తం పెట్టుబడుల్లో ఒక స్టాక్‌కు 5–10 శాతం మించి కేటాయింపులు చేసుకోకూడదని నిపుణులు సూచిస్తుంటారు.

మూలాలు మర్చిపోకూడదు
నాణ్యమైన కంపెనీలు, మెరుగైన యాజమాన్యాలు, మంచి నగదు ప్రవాహాలతో కూడిన బలమైన బ్యాలన్స్‌ షీట్లు  ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకోవడం కూడా రిస్క్‌ తగ్గించుకునే మార్గాల్లో ముఖ్యమైనది. బేర్‌ మార్కెట్లలో ఈ తరహా కంపెనీలు పడినా గట్టిగానే నిలబడతాయి. తిరిగి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత మంచి పనితీరును నమోదు చేస్తాయి. నాణ్యమైన కంపెనీల్లో యావరేజ్‌ చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. మంచి నాణ్యమైన స్టాక్‌ను కొనుగోలు చేసిన తర్వాత స్టాక్‌ ధర పడిపోయినప్పటికీ కంగారు పడిపోనక్కర్లేదు. అదనపు పెట్టుబడులకు అవకాశంగానే చూడొచ్చు. ముఖ్యంగా సైక్లికల్‌ స్టాక్స్‌లో యావరేజ్‌ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. చారిత్రకంగా చూస్తే సైక్లికల్‌ స్టాక్స్‌ కనిష్ట విలువల వద్ద లభిస్తున్నప్పుడు వాటిని కొనుగోలు చేయడం, యావరేజ్‌ చేయడం  కలిసొస్తుంది. 

కొంత ‘క్యాష్‌’ ఉంచుకోవాలి
బేర్‌ మార్కెట్లే కాదు.. బుల్‌ మార్కెట్లు కూడా దీర్ఘకాల ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అవకాశాలు తీసుకొస్తుంటాయి. పెట్టుబడులకు అనువైన అవకాశాలు ఈక్విటీ మార్కెట్లలో అన్నివేళలా అందుబాటులో ఉంటుంటాయి. మార్కెట్లు చారిత్రకంగా గరిష్టాల వద్ద ట్రేడవుతున్నాయని పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, కనిష్టాల వద్ద ట్రేడవుతున్నాయని పూర్తిగా పెట్టుబడులు పెట్టేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లు ఎప్పుడైనా కుప్పకూలిన తర్వాత వచ్చే బుల్‌ ర్యాలీలో స్పెక్యులేటివ్‌ ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుంది. దాన్ని చూసి కంగారు పడాల్సిన పనిలేదు. 2004–2007 బుల్‌ ర్యాలీలో పెట్టుబడులు పెట్టలేకపోయామని బాధపడిన వారికి.. 2009లో మరో అవకాశం వచ్చింది.

2005 నాటి విలువల వద్ద తిరిగి 2009లో ఆయా స్టాక్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాగే, 2013–2020 మధ్య ర్యాలీలో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోలేకపోయామే అని బాధపడిన వారికి 2020 మార్చి–ఏప్రిల్‌ దిద్దుబాటులో 2014 నాటి కనిష్ట విలువలకు స్టాక్స్‌ లభించాయి. అందుకే మార్కెట్లలో అవకాశాలను కోల్పోయామన్న వెర్రి పనికిరాదు. ఓపికగా వేచి చూసే ధోరణితో ఉంటే మంచి అవకాశాలు ఎప్పుడూ వస్తుంటాయి. ప్రస్తుత బుల్‌ ర్యాలీలో పాల్గొనలేదని మథనపడొద్దు. మళ్లీ ఆకర్షణీయమైన విలువల వద్ద స్టాక్స్‌లోకి ప్రవేశించేందుకు భవిష్యత్తులోనూ అవకాశాలు తలుపులు తడతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement