ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వ్యవస్థల్లోని ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. దీని ప్రభావం ఇప్పటికే ప్రారంభం కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పును కలిగిస్తుందని, అయితే ఉత్పాదకత స్థాయిలను పెంచడానికి, ప్రపంచ వృద్ధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ చెబుతున్నారు.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 60 శాతం ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా.. దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు బయలుదేరే కొద్దిసేపటి ముందు వాషింగ్టన్‌లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందన్న అంచనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తాజా నివేదికను ఉటంకిస్తూ పేర్కొన్నారు.
సగం మంది పోయినా మిగిలినవారికి లబ్ధి
ఎంత ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందన్నారు. ఏఐ వల్ల ఉద్యోగం పూర్తిగా పోవచ్చు లేదా మెరుగుపడవచ్చని, ఉత్పాదకత, ఆదాయ స్థాయి పెరగవచ్చని జార్జివా చెప్పారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సగం ఉద్యోగాలు పోయినప్పటికీ మిగిలిన సగం మంది ఏఐ కారణంగా మెరుగైన ఉత్పాదకత ప్రయోజనం పొందుతారని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది.
ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్మిక వ్యవస్థపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దగా ఉండదని, అదే సమయంలో దాని ద్వారా ఉత్పన్నమయ్యే మెరుగైన ఉత్పాదకత నుంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే అవకాశాలను అందుకోవడానికి పేద దేశాలకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాల్సిఉందని జార్జివా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment