
న్యూఢిల్లీ: చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. చైనా ప్రభుత్వంతో వివాదం నేపథ్యంలో ఆయన అదృశ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా తన సొంత టాలెంట్ షో ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ కార్యక్రమం తుది ఎపిసోడ్‌లో ఆయన న్యాయనిర్ణేతగా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం సందేహాలు రేకెత్తిస్తోంది. కార్యక్రమానికి మా హాజరు కాకపోవడం, షో వెబ్‌సైట్ నుంచి ఆయన ఫొటోలను కూడా తొలగించడం వంటి అంశాలన్నీ చూస్తే దీని వెనుక చైనా ప్రభుత్వం హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వంపై విమర్శలతో వివాదం..
చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కణ్నుంచి జాక్ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీవో (37 బిలియన్ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది.