న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 106 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 69 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,476 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 2,889 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో దక్షిణాది మినహా ఇతర మార్కెట్లలో కొత్తగా ఐదు షోరూములను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి సెప్టెంబర్‌కల్లా మధ్యప్రాచ్యంతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 163కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కల్యాణ్ జ్యువెలర్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం పతనమై రూ. 103 వద్ద ముగిసింది.
ఎన్‌హెచ్‌పీసీ లాభం ప్లస్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ పీఎస్‌యూ ఎన్‌హెచ్‌పీసీ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు 22 శాతం వృద్ధితో రూ. 1,686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,387 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,166 కోట్ల నుంచి రూ. 3,529 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 43 వద్ద ముగిసింది.
ఆయిల్ ఇండియాకు రికార్డు లాభాలు
ప్రభుత్వరంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఇండియా సెప్టెంబర్ క్వార్టర్‌కు రికార్డు స్థాయి లాభాలను ప్రకటించింది. రూ1,720 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.6,671 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.504 కోట్లు, ఆదాయం రూ.3,679 కోట్లుగా ఉండడం గమనార్హం ఓఎన్‌జీసీ తర్వాత ఆయిల్ ఇండియా దేశీయంగా రెండో అతిపెద్ద చమురు కంపెనీ కావడం గమనార్హం. ఒక్కో బ్యారెల్‌కు సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.100.59 డాలర్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది బ్యారెల్‌కు 71 డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆయిల్ ఉత్పత్తిలోనూ పెద్దగా మార్పులేదు. 0.79 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 0.82 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది.
ఐషర్ మోటార్స్ లాభం హైజంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 657 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 373 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,250 కోట్ల నుంచి రూ. 3,519 కోట్లకు ఎగసింది. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 65 శాతం వృద్ధితో 2,03,451 యూనిట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు బీఎస్‌ఈలో 0.8 శాతం క్షీణించి రూ. 3,702 వద్ద ముగిసింది.
లాభాల్లోకి సుజ్లాన్ ఎనర్జీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ 2)లో రూ. 56.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 12.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,362 కోట్ల నుంచి రూ. 1,443 కోట్లకు బలపడింది. సెప్టెంబర్‌కల్లా 759 మెగావాట్ల ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్ గిరీష్ తంతి పేర్కొన్నారు. 193 మెగావాట్ల కొత్త ఆర్డర్లను జత చేసుకున్నట్లు తెలియజేశారు. రైట్స్ నిధులతో రూ. 583 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ తెలియజేశారు. వెరసి నికర రుణ భారం రూ. 2,722 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.6 శాతం బలపడి రూ. 8.30 వద్ద ముగిసింది.
పెట్రోనెట్ డివిడెండ్ రూ. 7
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ కంపెనీ పెట్రో నెట్ ఎల్‌ఎన్‌జీ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 786 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 818 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 15,986 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 10,813 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారు లకు షేరుకి రూ. 7 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ ప్రధాన టెర్మినల్ దహేజ్ 182 టీబీటీ యూనిట్ల ఎల్‌ఎన్‌జీని ప్రాసెస్ చేసింది. గత క్యూ2లో 225 టీబీటీయూ నమోదైంది. ఒడిషాలోని గోపాల్‌పూర్ పోర్టులో 4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో తేలియాడే ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 2,306 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో పెట్రోనెట్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 212 వద్ద ముగిసింది.
బాటా లాభంలో 47% వృద్ధి
న్యూఢిల్లీ: బాటా ఇండియా కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 47% పెరిగి రూ. 55 కోట్లుగా నమోదైంది. ఆదాయం 35% వృద్ధితో రూ.830 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.37 కోట్లు, ఆదాయం రూ.614 కోట్లుగా ఉన్నాయి. క్లిష్టమైన నిర్వహణ వాతావరణం, అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ అన్ని వ్యాపార చానల్స్‌లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా తెలిపింది.
తగ్గిన అపోలో లాభం
వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.3,723 కోట్ల నుంచి రూ.4,274 కోట్లకు ఎగసింది. క్రితం ముగింపుతో పోలిస్తే అపోలో షేరు ధర బీఎస్‌ఈలో గురువారం 1.80 శాతం తగ్గి రూ.4,282.25 వద్ద స్థిరపడింది.
తగ్గిన నాట్కో లాభం
ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.75 శాతం తగ్గి రూ.56.8 కోట్లు సాధించింది. టర్నోవర్ 9 శాతం ఎగసి రూ.452 కోట్లు నమోదు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండవ మధ్యంతర డివిడెండ్ కింద 75 పైసలు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈలో నాట్కో షేరు ధర గురువారం 4.19 శాతం తగ్గి రూ.588.25 వద్ద స్థిరపడింది.
ఐఆర్‌ఎఫ్‌సీ ఫర్వాలేదు
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం పెరిగి రూ.1,714 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.24 శాతం పెరిగి రూ.5,810 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది కాలానికి లాభం రూ.1,501 కోట్లు, ఆదాయం రూ.4,690 కోట్ల చొప్పున ఉన్నాయి. నిర్వహణ ఆస్తులు రూ.4,39,070 కోట్లకు చేరాయి. ఒక్కో షేరుకు రూ.0.80 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది.
ముత్తూట్ ఫైనాన్స్ లాభం రూ.902 కోట్లు
బంగారం, ఇతర రుణాలు అందించే ముత్తూట్ ఫైనాన్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.902 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.1,003 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో లాభం రూ.825 కోట్లతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా ) 9 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఇక కంపెనీ ఆదాయం సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.2,842 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,065 కోట్లతో పోలిస్తే తగ్గింది. ముఖ్యంగా వడ్డీ ఆదాయం 8.2 శాతం తగ్గి రూ.2,758 కోట్లకు పరిమితం కావడం లాభాల క్షీణతకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 4,641 శాఖలు ఉన్నాయి. తన దగ్గర రుణగ్రహీతలు తనఖాగా ఉంచిన 177 టన్నుల బంగారం ఆభరణాల్లో 65 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ తెలిపింది. వ్యక్తిగత రుణాలు, నగదు బదిలీ సేవలను కూడా ముత్తూట్ ఆఫర్ చేస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment