ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు కనిపించడం లేదా? ఇదేమి ప్రశ్నంటారా? ఇది నిజంగానే చాలా మందిని కలవరపెట్టి, కంగారు పెట్టిన ప్రశ్న.మీరు చెల్లించిన పన్ను చెల్లింపులు ..అడ్వాన్స్ ట్యాక్స్ కానివ్వండి..సెల్ఫ్ అసెస్‌మెంట్ కానివ్వండి..మీ తరఫున మరో వ్యక్తి చేసిన టీడీఎస్..టీసీఎస్ లాంటివన్నీ మీరు చెల్లించినట్లు .. మీ ఖాతాలోనే పడాలి .. కనిపించాలి. గతంలో ఎన్నోసార్లు ప్రస్తావించాం. ఫారం 16ఏ. ఇది మీ జాతక చక్రం. ఈ ఫారంలో ఎప్పటికప్పుడు ప్రతీ చెల్లింపు నమోదు అవ్వాలి. డిపార్ట్‌మెంటు వారు నమోదు చేస్తారు. అందులో కనిపిస్తేనే మీరు చెల్లించినట్లు. ఒకవేళ కనిపించకపోతే కారణాలివే.
►మీరు కట్టినప్పుడు చలాన్ నింపాలి. పాన్ తప్పు రాసినా. పేరు తప్పు రాసినా. అసెస్‌మెంట్ సంవత్సరం తప్పు రాసినా ఆ వివరాలు పొందుపర్చరు.
►టీడీఎస్, టీసీఎస్ చేసిన వ్యక్తి చేసే తప్పులు పూర్తి సమాచారం రాయకపోవడం,మర్చిపోవడం.
►మీరు మీ పాన్ ఇవ్వకపోయినా
►మీ పాన్ తప్పుగా ఇచ్చినా
►డిడక్ట్ చేసిన వ్యక్తి మీ పాన్ తప్పు రాసినా, అసలు రాయకపోయినా
►మీరు తప్పుడు చలాన్లు వాడినా
►డిడక్టరు తన ఖీఅ తప్పుగా రాసినా, అసలు రాయకపోయినా
► డిడక్టరు తన పాన్ తప్పుగా రాసినా, అసలు రాయకపోయినా
పైన జాబితా విశ్లేషిస్తే, ఏ స్థాయిలో ఎవరు తప్పు చేసినా, వివరాలు రాయకపోయినా, ఏ గోల్‌మాల్ జరిగినా, మీ స్టేట్‌మెంట్‌లో తప్పులు దొర్లవచ్చు. ఎంట్రీలు కనపడకపోవచ్చు.అలాంటప్పుడు మీరేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
‘‘అయ్యగారు ఏం చేస్తున్నారు..అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు’’ అన్నట్లు అన్నీ దిద్దుబాటు చర్యలే. దేవుణ్ని పక్కకు జరగమని పూజారిని ఆశ్రయించాలి. మీరే స్వయంగా చలాన్ నింపి బ్యాంకులో చెల్లించినప్పుడు, మీ చేతిలో తప్పులు దొర్లేందుకు అవకాశం ఉంది. బ్యాంకర్లు వాటిని చెక్ చెయ్యరు. చేయలేరు. మీరు తప్పు చేస్తే వారిని ఏమీ అనలేరు. వారు రికార్డుల ద్వారా రిటర్నులు ‘‘టీడీఎస్, టీసీఎస్’’ రూల్స్ ప్రకారం చేయాలి.
ఆ రిటర్నులు వేసేటప్పుడు తప్పులు దొర్లితే సరిదిద్దమనండి. కొంత మంది డిడక్టర్లు ‘‘నిదానమే ప్రధానం’’ అని ఆలస్యం చేస్తుంటారు. కొంత మంది పన్ను ఎగవేతదారులు పన్ను చెల్లించకుండా నాటకాలు ఆడుతుంటారు. కొంత మంది మీనమేషాలు లెక్కపెడుతుంటారు. వారిని నిద్రలేపండి. రిటర్నులు కరెక్టుగా వేసేలా చేయండి. వేసిన వాటిలో తప్పులు దిద్దమనండి. అవసరమైన కూర్పులు, మార్పులు, చేర్పులు చేయమనండి.
పొరపాటునో, కావాలనో వారు చేసిన తప్పులను మీ గ్రహపాటుగా భావించి, తప్పులు తడకలను మార్చి రిటర్నులలో మీ సమాచారం సరిగ్గా .. సక్రమంగా .. సమగ్రంగా ఉండేలా సరిచూసుకోండి. పన్ను చెల్లింపులు కనిపిస్తాయి. ఇలా చేస్తే మీ జాతకచక్రం సరిగ్గా వేసినట్లు అవుతుంది.
చదవండి👉 ఇన్‌కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?
Comments
Please login to add a commentAdd a comment