
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎస్‌ఎఫ్‌ఎల్) నవకల్పనలు, వృద్ధి, దేశవ్యాప్తంగా ఆర్థికాంశాల గురించి అవగాహన కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. సర్వీసుల పోర్ట్‌పోలియోను విస్తరిస్తోందని, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ను సరళతరం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
రిలయన్స్ అనుబంధ సంస్థ జేఎఫ్‌ఎస్‌ఎల్ తొలి వార్షిక నివేదికను గురువారం విడుదల చేసిన సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. టెక్నాలజీ ఊతంతో వివిధ వర్గాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ప్రోడక్టులు అందించడం ద్వారా ఆర్థికంగా సమ్మిళిత భారత భవిష్యత్‌ను తీర్చిదిద్దే విషయంలో కంపెనీ సారథ్య బాధ్యతలను నిర్వర్తించగలదని ఆయన పేర్కొన్నారు.
భారత మార్కెట్‌పై గల అపార అవగాహన, టెక్నాలజీలో అనుభవాన్ని ఉపయోగించుకుని కస్టమర్ల అవసరాలకు తగిన ఆర్థిక సాధనాలు, సేవలను రూపొందించడం కొనసాగిస్తుందని వివరించారు. అధునాతన సాంకేతికత తోడ్పాటుతో యూజర్ల అనుభూతిని మెరుగుపర్చే దిశగా జియోఫైనాన్స్ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు జేఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ ఈషా ఎం అంబానీ తెలిపారు.