సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. గతంలో ఎన్నడూ చూడని వేగంతో ఇటీవలి కాలంలో రిలయన్స్ గ్రూప్ అనేక కొత్త వ్యాపారాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా రిలయన్స్ బ్రిటిష్ కాఫీ షాప్ ప్రెట్ ఎ మ్యాంగర్‌ను దేశానికి తీసుకురావడం ద్వారా టాటాతో పోటీకి సౌ అంటోంది. దీనికి సంబంధించి బ్రిటీష్ శాండ్‌విచ్ అండ్ కాఫీ చైన్ 'ప్రెట్ ఎ మాంగర్' తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
రిలయన్స్ బ్రిటిష్ కాఫీ భాగస్వామ్యంలో ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో మేకర్ మ్యాక్సిటీలో ప్రీట్ ఎ మ్యాంగర్ తన తొలి అవుట్‌లెట్ ప్రారంభమైంది. ప్రెట్ ఎ మేంగర్ షాప్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పాల్గొన్నారు. ముంబై షాప్ 2,567 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద డైనింగ్ స్పేస్‌తో ఉన్న ప్రెట్ ఐకానిక్ స్టోర్ లాంచింగ్‌పై సారా కాఫీ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. కాఫీ అంటే చాలా ఇష్టమని నాన్నతో కలిసి లండన్‌లోని ప్రెట్ స్టోర్‌ని చాలాసార్లు సందర్శించాను ఇపుడిది మన దేశానికి రావడం ఆనందంగా ఉందని పేర్కొంది. (లేఆఫ్స్ ఆందోళనల మధ్య: గూగుల్ సీఈవో షాకింగ్ వేతనం)
రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యం కోసం గత ఏడాది బ్రిటిష్ యజమానితో డీల్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 ప్రీట్ ఎ మాంగర్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. తొలి ఏడాదిలోనే పది 'ప్రెట్ ఎ మ్యాంగర్' స్టోర్‌లను ప్రారంభించనున్నామని రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. రిలయన్స్ బ్రాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దర్శన్ మెహతా, యూకే బ్రాండ్ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రాధాన్యతలు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం ప్రెట్ బ్రాండ్‌ను రిలయన్స్ ద్వారా లాంచ్ చేయడం ఆనందమని బృందంతో ప్రెట్ ఎ మాంగర్ సీఈవో పనో క్రిస్టౌ తెలిపారు. చాలా కాలంగా ఇండియాకు రావాలనేది లక్ష్యం. ముంబైలో తొలి స్టోర్‌ను లాంచ్ చేయడం తమ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలలో ఒక మైలురాయని చెప్పారు.
యుఎస్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ దేశంలో తన తొలి రెండు స్టోర్లను ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ప్రెట్ ఎ మ్యాంగర్స్ ఇండియన్ స్టోర్‌ను ప్రారంభించడం విశేషం. టిమ్ కుక్ ఇండియా టూర్‌లో భాగంగా ముంబైలోని ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల ఆంటిలియాని ఇంటిని కూడా సందర్శించారు.
కాగా 1986లో లండన్‌లో ప్రారంభమైన ప్రెట్ ఎ మాంగర్ యూఏ, అమెరికా హాంకాంగ్, ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, సింగపూర్ జర్మనీతో సహా దేశాల్లో దాదాపు 550 దుకాణాలను నిర్వహిస్తోంది. అలాగే టాటా స్టార్‌బక్స్‌కు 30 నగరాల్లో 275 స్టోర్‌లున్నాయి. 50 శాతం వాటాతో అమెరికన్ కాఫీ చైన్‌నునిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాటాలు కొత్తగా రికార్డు స్థాయిలో 50 స్టోర్లను ప్రారంభించారు. 2025 నాటికి దేశీయ కాఫీ మార్కెట్ 4.2 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment