ఒప్పంద కార్యక్రమంలో రవి సంఘీ, గౌతమ్ అదానీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన సంఘీ ఇండస్ట్రీస్‌లో 56.74 శాతం వాటా కొనుగోలు చేసింది. సంఘీ ప్రమోటర్లు అయిన రవి సంఘీ, కుటుంబం నుంచి ఈ వాటా దక్కించుకుంది. ఇందుకోసం అంబుజా సిమెంట్స్ రూ.1,674 కోట్లు వెచి్చస్తోంది. మరో 26 శాతం వాటా కోసం అంబుజా సిమెంట్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది.
6.71 కోట్ల ఈక్విటీ షేర్లకుగాను 13.8 శాతం ప్రీమియంతో ఒక్కొక్కటి రూ.114.22 చొప్పున రూ.767 కోట్లను ఖర్చు చేయనుంది. ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే సంఘీ ఇండస్ట్రీస్‌లో అంబుజా సిమెంట్స్‌కు 82.74 శాతం వాటా దక్కుతుంది. ఈ డీల్‌లో భాగంగా సంఘీ ఇండస్ట్రీస్‌ను రూ.5,000 కోట్లుగా విలువ కట్టారు. 3–4 నెలల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలుతో అంబుజా సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.36 కోట్ల టన్నులకు చేరనుంది.
ఉత్పత్తి సామర్థ్యం పెంపు..
సంఘీ సిమెంట్స్‌కు గుజరాత్‌లోని కచ్ వద్ద ఉన్న సంఘీపురంలో 61 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక తయారీ సామర్థ్యం గల సిమెంట్ ప్లాంటుతోపాటు 66 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో క్లింకర్ ప్లాంట్ ఉంది. ‘సంఘీ ఇండస్ట్రీస్‌తో చేతులు కలపడం ద్వారా అంబుజా తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి.. నిర్మాణ సామగ్రి రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. సంఘీ ఇండస్ట్రీస్‌కు ఉన్న 100 కోట్ల టన్నుల సున్నపురాయి నిల్వలతో అంబుజా సిమెంట్స్ వచ్చే రెండేళ్లలో సంఘీపురంలో సిమెంట్ సామర్థ్యాన్ని 1.5 కోట్ల టన్నులకు చేర్చనుంది. అదానీ గ్రూప్ 2028 నాటికి 14 కోట్ల మెట్రిక్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉంది’ అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ సందర్భంగా తెలిపారు.
పెద్ద నౌకలకు వీలుగా..
8,000 డెడ్ వెయిట్ టన్నేజ్ సామర్థ్యం గల పెద్ద నౌకలు వచ్చేందుకు వీలుగా అక్కడే ఉన్న పోర్టును విస్తరించడానికి పెట్టుబడి చేయనున్నట్టు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్ సీఈవో కరణ్ అదానీ వెల్లడించారు. దేశంలో అతి తక్కువ ఖర్చుతో క్లింకర్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటుగా సంఘీ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని చెప్పారు.
గురువారం అంబుజా షేరు ధర 2.87% పెరిగి రూ.474.20 వద్ద, సంఘీ ఇండస్ట్రీస్ షేరు ధర 4.99% ఎగసి రూ.105.76 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment