సాక్షి, హైదరాబాద్: అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) విక్రయాలలో పశ్చిమాది నగరాలు ముందుండగా.. దక్షిణంలో కాస్త నెమ్మదించాయి. కరోనా కంటే ముందుతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఇన్వెంటరీ 32 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో పశ్చిమాది నగరాలైన ముంబై, పుణేలో ఇన్వెంటరీ 10 శాతం తగ్గిందని అనరాక్ గ్రూప్ తెలిపింది. 2020 క్యూ1లో దక్షిణాది నగరాలలో 1.21 లక్షల యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1.60 లక్షలకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో అత్యధిక స్థాయిలో కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లే ఇన్వెంటరీ వృద్ధికి ప్రధాన కారణం. ఇక పశ్చిమాది నగరాల్లో 2020 క్యూ1లో 3.07 లక్షల యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ప్రస్తుతమది 2.75 లక్షలకు క్షీణించింది. 2020 క్యూ1లో దక్షిణాది నగరాలలో 15,650 యూనిట్లు లాంచింగ్ కాగా.. 2022 క్యూ1 నాటికి 142 శాతం వృద్ది రేటుతో 37,810 యూనిట్లకు పెరిగింది. అదే పశ్చిమాది నగరాలలో 18,270 యూనిట్ల నుంచి 142 శాతం వృద్ధితో 38,130 యూనిట్లకు చేరాయి.
ఎన్‌సీఆర్‌లో 12 శాతం క్షీణత..
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, రెరా వంటి నిర్ణయాలతో కరోనా కంటే ముందు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో ప్రాజెక్ట్‌ల అప్పగింత ఆలస్యమయ్యాయి. దక్షిణాది నగరాలలో కంటే ఎన్‌సీఆర్‌లో డెలివరీ ఎక్కువ కాలం పట్టేది. కానీ, కరోనా తర్వాతి ఎన్‌సీఆర్‌లో దక్షిణ, పశ్చిమాది నగరాలలో కంటే చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు వచ్చాయని.. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్‌సీఆర్‌లో ఇన్వెంటరీ 12 శాతం తగ్గిందని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. 2021 క్యూ1లో ఎన్‌సీఆర్‌లో ఇన్వెంటరీ 1.73 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1.53 లక్షల యూనిట్లకు క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment