ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, ఉపకరణాలు తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్.. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ కంపెనీ తయారు చేసిన ఐఫోన్లు భారీగా అమ్ముడుపోవడంతో అత్యధిక లాభాలు వచ్చాయి.
యాపిల్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 119.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.9 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 2 శాతం అధికం. ఈ త్రైమాసికంలో ఐఫోన్లు 6 శాతం అధికంగా అమ్ముడుపోయాయి. మొత్తం ఆదాయంలో ఐఫోన్ల ద్వారా వచ్చిన ఆదాయం 69.7 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.5.7 లక్షల కోట్లు).
యాపిల్ యాక్టివ్ డివైజ్ బేస్ ఆల్‌టైమ్ హైని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులను వాడుతున్నవారి సంఖ్య 220 కోట్లను దాటింది. భారత్‌లో ఆదాయ పరంగా వృద్ధిని సాధించామని, డిసెంబర్ త్రైమాసికంలో బలమైన రెండంకెల వృద్ధిని, ఆదాయ రికార్డును తాకినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు.
భారత్‌తో పాటు మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, టర్కీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో యాపిల్ రికార్డు ఆదాయాలను నమోదు చేసింది. 2023లో ఆదాయ పరంగా యాపిల్ భారతీయ మార్కెట్‌లో అగ్రగామిగా ఉందని, ఎగుమతులలో కోటి యూనిట్లను అధిగమించిందని ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment