న్యూయార్క్/న్యూఢిల్లీ: కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్ స్టోర్ ఊతంతో భారత మార్కెట్లో టెక్ దిగ్గజం యాపిల్ విక్రయాలు మరింతగా పెరుగుతున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో తమ వ్యాపారం రెట్టింపయినట్లు సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. దేశీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగంలో శాంసంగ్, వన్‌ప్లస్‌తో యాపిల్ పోటీ పడుతోంది. గత త్రైమాసికంలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 111.4 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కుక్ తెలిపారు. వార్షికంగా 21 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమ్మకాలే 64 శాతంగా ఉన్నట్లు వివరించారు. ‘ఉదాహరణకు భారత్ విషయాన్నే తీసుకుంటే అంతక్రితం ఏడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే వ్యాపారం రెట్టింపయ్యింది.
ఆన్‌లైన్ స్టోర్ పెట్టిన తర్వాత ఇవి తొలి పూర్తి స్థాయి త్రైమాసిక ఫలితాలు. అయితే, అవకాశాల పరిమాణంతో చూస్తే వ్యాపారం ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. కానీ, రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి సాధించబోతున్నాం‘ అని కుక్ చెప్పారు. త్వరలో భారత్‌లో రిటైల్ స్టోర్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. సెప్టెంబర్ 23న యాపిల్.. భారత్‌లో తమ తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. కౌంటర్‌పాయింట్ వంటి రీసెర్చ్ సంస్థల నివేదికల ప్రకారం 2020 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో యాపిల్ అమ్మకాలు 171% పెరిగాయి. ఐఫోన్ 12 ఆవిష్కరణ, ఐఫోన్ ఎస్‌ఈ 2020, ఐఫోన్ 11పై ఆకర్షణీయ ఆఫర్లు, ఆన్‌లైన్‌లో విక్రయాలు వంటివి ఇందుకు దోహదపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment