యాపిల్ ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కొత్త సిరీస్, మోడల్ ఐఫోన్ రాగానే కొనేందుకు డబ్బున్నవారు ఎగబడతుంటారు. అయితే ఐఫోన్ అన్నది సామాన్యులకు మాత్రం కలగానే మిగులుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ రేటులో ఐఫోన్ మోడల్‌ను తీసుకొచ్చేందుకు యాపిల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అప్‌డేటెడ్ ఐఫోన్ ఎస్‌ఈ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు యాపిల్ సిద్ధమైందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇది లో-ఎండ్ ఐఫోన్ మోడల్ కానుంది. దీంతోపాటు కొత్త ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌లను కూడా యాపిల్ తయారు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ కొత్త ఉత్పత్తులు వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కావచ్చని నివేదిక పేర్కొంది.
ఐఫోన్ ఎస్‌ఈని సాధారణంగా ఐఫోన్ సిరీస్‌లలోకెల్లా చౌకైన మోడల్‌గా పరిగణిస్తారు. దీని ధరలు 429 డాలర్ల (సుమారు రూ.36 వేలు) నుండి ప్రారంభమవుతాయి. 2022లో 5జీ, వేగవంతమైన A15 బయోనిక్ చిప్‌ను జోడించిన తర్వాత ఐఫోన్ ఎస్‌ఈ మోడల్‌కు ఇది మొదటి అప్‌డేట్ కానుంది. కొత్త ఐఫోన్ ఎస్‌ఈ కంపెనీ ఏఐ సాఫ్ట్‌వేర్, యాపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేస్తుందని నివేదిక వెల్లడించింది. మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న సామ్‌సంగ్, షావోమీ వంటి బ్రాండ్‌లతో ఈ మోడల్ ద్వారా యాపిల్ పోటీ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment