సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తన తొలి ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్ కు బాగా కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. భారతీయ స్మార్ట్ ఫోన్ విభాగంలో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అమెరికా, యూరప్ ఆసియా పసిఫిక్ దేశాలతోపాటు ఇండియాలో ఈ త్రైమాసికంలో రికార్డు అమ్మకాలను సాధించామని ఫలితాల వెల్లడి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. భారతదేశంలో సెప్టెంబర్ 23న తమ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించిన నేపథ్యంలో మంచి ఆదరణ లభించిందని ప్రకటించారు. ఇందుకు యూజర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ వచ్చేసింది : విశేషాలు) (ఐఫోన్ 12, 12 ప్రో సేల్ షురూ, డిస్కౌంట్స్)
నిన్న (అక్టోబరు 29) క్యూ4 ఫలితాలను ఆపిల్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం స్వల్పంగా పుంజుకుని 64.7 బిలియన్ డాలర్లుగా ఉంది. లాభం 7 శాతం తగ్గి 12.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఫోన్ గ్లోబల్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ జూలై-సెప్టెంబర్ కాలంలో ఇండియాకు ఆపిల్ 8 లక్షలకు పైగా ఐఫోన్లను రవాణా చేసింది. తద్వారా రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని నివేదించింది. ధరల పరంగా మార్కెట్‌ను ఆపిల్ పూర్తిగా అర్థం చేసుకుంటోందనీ, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ 11వంటి హాట్-సెల్లింగ్ ఫోన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో భారతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో నెమ్మదిగా, స్థిరంగా ప్రవేశిస్తోందని కౌంటర్ పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాథక్ వ్యాఖ్యానించారు. ఐఫోన్12తో రాబోయే త్రైమాసికంలో తన స్థానాన్ని ఆపిల్ మరింత పటిష్టం చేసుకుంటుందన్నారు. (ఐఫోన్స్ ప్రీబుకింగ్‌పై ‘సంగీత’ భారీ ఆఫర్లు)
ఆపిల్ తన కొత్త ఆన్‌లైన్ స్టోర్‌తో ఉత్సాహాన్ని పుంజుకుందనీ, ప్రీ-ఆర్డర్‌ల పరంగా ఐఫోన్ 12 సిరీస్‌కు మంచి ఆదరణ లభించిందని సీఎంఆర్ హెడ్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజి) ప్రభు రామ్ తెలిపారు. మరోవైపు అక్టోబర్ 23 న ప్రారంభించిన కొత్త ఐఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఫోన్ 12, 12 ప్రోలకు అద్భుతమైన ప్రీ-ఆర్డర్‌లను స్వీకరిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment