ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 బుకింగ్‌ షురూ | Aprilia SXR 160 maxi scooter bookings starts now | Sakshi
Sakshi News home page

ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 బుకింగ్‌ షురూ

Published Fri, Dec 11 2020 4:43 PM | Last Updated on Fri, Dec 11 2020 4:51 PM

Aprilia SXR 160 maxi scooter bookings starts - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: మ్యాక్సి స్కూటర్‌.. ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160కు బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పియాజియో ఇండియా తాజాగా పేర్కొంది. విడుదలకు ముందు (ప్రీలాంచ్‌) బుకింగ్‌కు తెరతీసినట్లు తెలియజేసింది. రూ. 5,000 చెల్లించడం ద్వారా స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ప్రీమియం స్కూటర్‌ను ప్రస్తుతం బారామతి ప్లాంటులో తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. బీఎస్‌-6 ప్రమాణాలతోపాటు.. లెడ్‌ స్ప్లిట్‌ హెడ్‌లైట్లు, మొబైల్‌ కనెక్టివిటీ, సర్దుబాటుకు వీలయ్యే వెనుక సస్పెన్షన్‌, డిస్క్‌ బ్రేకులు తదితర ఫీచర్స్‌ను పొందుపరచినట్లు పియాజియో ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా డీలర్ల ద్వారా దేశవ్యాప్తంగా బుకింగ్స్‌కు వీలున్నట్లు తెలియజేసింది. (హెల్మెట్‌ వాయిస్‌ కమాండ్స్‌తో ఇక బైకులు!)

సవాళ్లున్నప్పటికీ
2020లో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ దేశీయంగా ప్రీమియం స్కూటర్‌ ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ఉత్పత్తిని చేపట్టగలిగినట్లు పియాజియో ఇండియా చైర్మన్‌ డీగో గ్రాఫీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఆధునిక ఫీచర్లు, తరువాతి తరం డిజైన్‌తో రానున్న ప్రీమియం స్కూటర్‌ వినియోగదారులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్‌ కలర్‌లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. దేశీయంగా జపనీస్‌ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 )

ఎల్‌సీడీ క్లస్టర్‌
దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్‌ ఇంజక్ట్‌డ్‌ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్‌లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, యూఎస్‌బీ చార్జింగ్‌ పోర్ట్‌, డిస్క్‌ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్‌ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్‌ క్రిస్టల్‌ హెడ్‌లైట్స్‌, 3 కోట్‌ హెచ్‌డీ బాడీ పెయింట్‌ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. ఎప్రిలియా ప్రీమియం స్కూటర్‌..  గ్లాసీ రెడ్‌, మ్యాట్‌ బ్లూ, గ్లాసీ వైట్‌ అండ్‌ మ్యాట్‌ బ్లాక్‌ కలర్స్‌లో లభ్యంకానున్నట్లు తెలియజేశారు. ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 1.10-1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement