
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన జర్మన్ బ్రాండ్ 'ఆడి' 2023 మే 01 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. కస్టమ్స్ డ్యూటీ అండ్ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలు వచ్చే నెల ప్రారభం నుంచి 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే క్యూ8 సెలబ్రేషన్, ఆర్‌ఎస్ 5, ఎస్ 5 ధరలు ఈ నెల ప్రారంభం నుంచి పెరిగిన విషయం అందరికి తెలిసిందే. కాగా వచ్చే నెల ప్రారంభం నుంచి మరో రెండు మోడల్స్ ధరలు పెరుగుతాయి.
ఆడి కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యాధునిక కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదల కొనుగోలుదారులపైన కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
కంపెనీ వివిధ స్థాయిలలో ధరల ప్రభావాన్ని కస్టమర్ల మీద పడకుండా చూడటానికి ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి ధరలను పెంచాల్సిన అవసరం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కూడా వివిధ మోడళ్ల ధరలను ఏప్రిల్ 01 నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు పెంచింది.