Benefits Of Forex Cards And Multicurrency Forex Cards For Travellers In Telugu - Sakshi
Sakshi News home page

Forex Cards Vs Multicurrency Forex Cards: ఫారిన్ టూర్.. ఫారెక్స్‌ కార్డ్‌ బెటర్

Published Mon, Jul 31 2023 12:17 AM | Last Updated on Mon, Jul 31 2023 12:33 PM

Benefits of Forex Cards and Multicurrency Forex Cards for Travellers - Sakshi

భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గతంతో పోలిస్తే విదేశీ ప్రయాణం ఎంతో సౌకర్యంగా మారింది. విమానాశ్రయాలు, విమాన సర్వీసుల నెట్‌వర్క్‌ విస్తృతం అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా, సులభంగా ప్రయాణించే వెసులుబాటు దక్కింది. మరి విదేశాలకు వెళ్లే వారు తమ వెంట ఆయా దేశానికి చెందిన కరెన్సీని కూడా తీసుకెళుతుంటారు.

ఈ అవసరాన్ని తప్పించేదే ఫారెక్స్‌ కార్డ్‌. ఏ దేశానికి వెళితే ఆ దేశ కరెన్సీ రూపంలో ఈ కార్డ్‌ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఫారెక్స్‌ కార్డ్‌ ఉంటే కరెన్సీ నోట్లు పాకెట్‌లో లేకపోయినా ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇది చెల్లుతుంది. డెబిట్, క్రెడిట్‌ కార్డ్‌ కంటే ఫారెక్స్‌ కార్డ్‌ వల్ల ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఈ ఫారెక్స్‌ కార్డుతో ప్రయోజనాలు? ఎలా పనిచేస్తుంది? ఇందులో ఎన్ని రకాలు? చార్జీలు తదితర విషయాలను తెలియజేసే కథనమే ఇది!

ఫారెక్స్‌ కార్డ్‌ అంటే..?
ఇదొక ప్రీపెయిడ్‌ కార్డ్‌. మీరు వెళ్లాలనుకునే దేశ కరెన్సీ మారకంలో డిపాజిట్‌ చేసుకుని, వినియోగించుకునే సాధనం. ఈ కార్డ్‌తో విదేశాల్లో చెల్లింపులు చేయడమే కాకుండా, ఏటీఎం నుంచి ఆ దేశ కరెన్సీని ఉపసంహరించుకోవచ్చు. ఈ కార్డ్‌ ఉంటే వెంట భౌతిక రూపంలో కరెన్సీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఫారెక్స్‌ కార్డుల్లో రకాలు...
విదేశాలకు వెళ్లే వారికి క్రెడిట్, డెబిట్‌ కార్డ్‌లతో పోలిస్తే ఫారెక్స్‌ కార్డ్‌ ఎంతో ఉపయోగకరం అని చెప్పుకోవాలి. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఈ కార్డుల్లో పలు రకాలు ఉన్నాయి. సింగిల్‌ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌ ఇందులో ఒకటి. ఏదైనా ఒక దేశ కరెన్సీనే ఇందులో లోడ్‌ చేసుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌ రెండో రకం. ఇందులో ఒకటికి మించిన దేశాల కరెన్సీలను లోడ్‌ చేసుకోవచ్చు. వివిధ దేశాలకు వెళ్లే వారికి మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌ ఉపయోగకరం. దాదాపు ప్రముఖ బ్యాంకులన్నీ కూడా ఫారెక్స్‌ కార్డ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి.   

ప్రయోజనాలు/సదుపాయాలు
విదేశాల్లో చెల్లింపులు సురక్షితంగా చేసేందుకు ఫారెక్స్‌ కార్డ్‌ అనుకూలం. క్రెడిట్‌ కార్డ్‌కు మాదిరే అన్ని రకాల సదుపాయాలు కూడా వీటిల్లో ఉంటాయి. ఇది ప్రీపెయిడ్‌ కార్డ్‌ కావడంతో, ముందుగానే బ్యాంక్‌ ఖాతా నుంచి లోడ్‌ చేసుకోవాలి. ఫలితంగా విదేశాల్లో వినియోగంపై స్వీయ నియంత్రణ ఉంటుంది. కావాల్సినంతే లోడ్‌ చేసుకోవచ్చు. అంతే మేర ఖర్చు చేసుకోవచ్చు. ఫారెక్స్‌ కార్డ్‌ను దాదాపు అన్ని చోట్లా ఆమోదిస్తారు కనుక సౌకర్యవంతగా ఉంటుంది. దీంతో ఏటీఎంలు లేదంటే ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపుల సాధనాల కోసం చూసుకోవాల్సిన అవసరం రాదు.

ముఖ్యంగా కరెన్సీని తీసుకెళ్లే అవసరాన్ని తప్పిస్తుంది. దీంతో నగదుతో పోలిస్తే సౌకర్యం, సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు కరెన్సీ విలువల్లో అస్థిరతల ప్రభావం కూడా ఉండదు. లోడ్‌ చేసిన రోజు విలువే స్థిరంగా కొనసాగుతుంది. దాంతో రోజువారీ కరెన్సీ మారకం హెచ్చుతగ్గుల సమస్య ఉండదు. క్రెడిట్, డెబిట్‌ కార్డు చార్జీలతో పోలిస్తే ఫారెక్స్‌ కార్డ్‌ చౌక ఆప్షన్‌. క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ను ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ కరెన్సీ మారకం చార్జీ పడుతుంది. ఎందుకంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశ కరెన్సీలోకి రూపాయిలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఈ మారకం చార్జీని కరెన్సీ మార్కప్‌ చార్జీగా పేర్కొంటారు. కార్డ్, బ్యాంక్‌ ఆధారంగా ఈ చార్జీ 2–5 శాతం మధ్య ఉంటుంది. ఫారెక్స్‌ కార్డుల్లో ఎన్నో సదుపాయాలు ఉండడంతో, సంప్రదాయ చెల్లింపు సాధనాలతో పోలిస్తే ఇవి ఆకర్షణీయమైనవని చెప్పుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌ ఉంటే, ఒకేసారి ఒక దేశం తర్వాత మరో దేశానికి వెళ్లేట్టు అయితే ఉపయోగకరంగా ఉంటుంది. కావాల్సిన ప్రతిసారీ బ్యాంకుల్లో కరెన్సీని మార్చుకోవడం కంటే ఫారెక్స్‌ కార్డు తీసుకెళ్లడమే సౌకర్యం.

బ్యాంకులకు సైతం ఫారెక్స్‌ కార్డులతో తక్కువ వ్యయం అవుతుంది. దీంతో అవి ఫారెక్స్‌ కార్డుదారులకు ఆ ప్రయోజనాలను అందిస్తుంటాయి. భౌతిక కరెన్సీతో పోలిస్తే ఫారెక్స్‌ కార్డులో లోడ్‌ చేసుకోవడం వల్ల మరింత మెరుగైన మారకం రేటు సాధ్యపడుతుంది. ఈ కార్డ్‌ పొందేందుకు ఆయా బ్యాంక్‌ ఖాతాదారు కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రీపెయిడ్‌ కార్డ్‌ కనుక, బ్యాంక్‌లు సులభంగా మంజూరు చేస్తుంటాయి. మార్కెట్లో వివిధ బ్యాంకులు ఎన్నో ఫీచర్లతో వీటిని ఆఫర్‌ చేస్తున్నాయి.

వీటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, తమకు అనుకూలమైనది తీసుకోవచ్చు. ఒకవేళ ఫారెక్స్‌ కార్డ్‌ను ఎక్కడైనా కోల్పోతే, వెంటనే బ్యాంక్‌ లేదా ఎన్‌బీ ఎఫ్‌సీకి కాల్‌ చేసి చెబితే మిగిలిన బ్యాలన్స్‌ దురి్వనియోగం కాకుండా ఫ్రీజ్‌ చేసేస్తారు. విదేశాల్లోని పీవోఎస్‌ మెషీన్ల వద్ద ఫారెక్స్‌ కార్డులను స్వైప్‌ చేస్తే ఎలాంటి చార్జీలు పడవు. కానీ అదే డెబిట్, క్రెడిట్‌ కార్డులను స్వైప్‌ చేసిన ప్రతిసారీ ఎంతో కొంత చార్జీ పడుతుంది. పైగా ఇతర సాధనాలతో పోలిస్తే ఫారెక్స్‌ కార్డులకు అంతర్జాతీయంగా ఎక్కువ ఆమోదం ఉంటుంది. అంతేకాదు విదేశాల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు సైతం ఫారెక్స్‌ కార్డులతో చెల్లింపులు చేసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌పై విదేశాల్లో ఖర్చు చేస్తే సకాలంలో చెల్లింపులు చేయకపోతే, భారీ వడ్డీ, లేట్‌ పేమెంట్‌ ఫీజులు పడతాయి. ఫారెక్స్‌ కార్డ్‌ ప్రీపెయిడ్‌ కార్డ్‌ కావడంతో ఈ సమస్య ఉండదు.

► ఒకేసారి ఒకటికి మించిన దేశాలను పర్యటించే వారు, ఆయా దేశాల కరెన్సీని వెంట తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా, మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌ ఎంపిక చేసుకోవడం నయం.  
► కార్డ్‌లో బ్యాలన్స్‌ మిగిలి ఉంటే, స్వదేశానికి వచి్చన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి నగదుగా మార్చుకోవచ్చు.  
► విదేశీ పర్యటన ముగించి స్వదేశానికి వచ్చిన తర్వాత.. తిరిగి విదేశానికి వెళ్లేంత వరకు కార్డ్‌ను డీయాక్టివేట్‌ చేసుకోవచ్చు. మళ్లీ విదేశీ యాత్రకు ముందు యాక్టివేట్‌ చేసుకోవచ్చు. దీంతో వినియోగం లేకపోయినా చార్జీలు, పెనాలీ్టలు పడవు. మెయింటెనెన్స్‌ చార్జీలు కూడా ఉండవు.
► ఫారెక్స్‌ కార్డ్‌లపై డీల్స్, డిస్కౌంట్లు వస్తుంటాయి.  
► ఫారెక్స్‌ కార్డుల్లో చాలా వరకు లాక్డ్‌ ఇన్‌ ఎక్సే్ఛంజ్‌ రేట్‌ అనే ఫీచర్‌తో వస్తాయి. అంటే కరెన్సీ రేటులో అస్థిరతలను ఈ సదుపాయంతో అధిగమించొచ్చు. ఉదాహరణకు కార్డులో డాలర్లు లోడ్‌ చేసుకుంటే, ఆ రోజు ఉన్న విలువ ప్రకారమే లాక్‌ అవుతుంది. దాని విలువ బ్యాలన్స్‌ ముగిసే వరకు స్థిరంగా కొనసాగుతుంది.  
► ఫారెక్స్‌ కార్డ్‌ లేకుండా వెళితే, విదేశాల్లో అవసరమైన చోట కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇందుకోసం శ్రమపడాల్సి రావచ్చు. ఫారెక్స్‌ కార్డ్‌ అయితే ఉన్న చోట నుంచే కోరుకున్న మారకం రేటులో లోడ్‌ చేసుకోవచ్చు.  
► అంతర్జాతీయ ఈ కామర్స్‌ పోర్టళ్లపై ఫారెక్స్‌ కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వర్తకులు ఈ కార్డ్‌ను ఆమోదిస్తారు. విమాన టికెట్‌ బుకింగ్‌లు, హోటల్‌ బుకింగ్, డైనింగ్, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ షాపింగ్‌కు
వాడుకోవచ్చు.
► ఫారెక్స్‌ కార్డ్‌తో ఏ దేశంలో ఏటీఎం నుంచి అయినా ఆ దేశ కరెన్సీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం లొకేషన్‌ ఆధారంగా ఏ దేశంలో ఉన్నారనేది కార్డ్‌ నెట్‌వర్క్‌ గుర్తిస్తుంది. సంబంధిత దేశ కరెన్సీని అందిస్తుంది.  
► ఫారెక్స్‌ కార్డ్‌లలో ఎంబెడెడ్‌ చిప్‌ టెక్నాలజీ ఉంటుంది. సున్నితమైన సమాచారం ఎన్‌క్రిపె్టడ్‌గా ఉండటంతో మోసాల రిస్క్‌ చాలా తక్కువ.  
► ఇవి కనీసం ఐదేళ్ల ఎక్స్‌పైరీ తేదీతో వస్తాయి.  
► ఒక దేశానికి వెళుతూ కొంత బ్యాలన్స్‌ను లోడ్‌ చేసుకున్న తర్వాత, చివరికి మిగులు ఉందనుకోండి.. ఆ తర్వాత ఆ బ్యాలన్స్‌ను ఏ దేశంలో అయినా వినియోగించుకోవచ్చు.  
► మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌ల్లో 16–22 దేశాల కరెన్సీలను లోడ్‌ చేసుకోవచ్చు.

ఫీజులు/చార్జీలు..
కార్డ్‌ జారీ చేసే సంస్థ ఆధారంగా ఫీజులు, చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. సింగిల్‌ కరెన్సీ కార్డ్‌తో పోలిస్తే మల్టీ కరెన్సీ కార్డ్‌ చార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇష్యూయన్స్‌ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ.100–500 మధ్య ఉంటుంది. రీలోడ్, రెన్యువల్‌ చార్జీలు కూడా చెల్లించుకోవాలి. కార్డులో కరెన్సీని లోడ్‌ చేసిన ప్రతిసారీ రీలోడ్‌ చార్జీ పడుతుంది. అదనపు కార్డ్‌ కావాలంటే యాడాన్‌ కార్డ్‌ తీసుకోవచ్చు. దీనికి విడిగా ఫీజు పడుతుంది.

కార్డులో బ్యాలన్స్‌ను నగదు రూపంలో తీసుకున్న సందర్భంలోనూ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో కార్డ్‌ నుంచి నగదు తీసుకున్న ప్రతి సారీ చార్జీ విధిస్తారు. కార్డ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకున్నా కూడా చార్జీ పడుతుంది. మీరు చెల్లింపులు చేసిన కరెన్సీ, కార్డ్‌లో లోడ్‌ అయి ఉన్న కరెన్సీ వేర్వేరు అయితే అప్పుడు క్రాస్‌ కరెన్సీ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇది 3.5 శాతం వరకు ఉంటుంది. అదే మలి్టపుల్‌ కరెన్సీ కార్డులో ఈ సమస్య ఉండదు. కార్డ్‌ను కోల్పోయి, తిరిగి తీసుకుంటే అప్పుడు కూడా చార్జీ పడుతుంది.

వీటిని గుర్తు పెట్టుకోవాలి..
► ప్రతి లావాదేవీ అనంతరం కార్డ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవాలి.  
► ఫారెక్స్‌ కార్డ్‌ ఎక్కడైనా పొగొట్టుకుంటే లేదా చోరీకి గురైనా వెంటనే బ్యాకప్‌ కార్డ్‌ తీసుకోవాలి.
► ప్రతీ పర్యటనకు ముందు ఏటీఎంకు వెళ్లి పిన్‌ మార్చుకోవాలి.  
► ఫారెక్స్‌ కార్డ్‌ను విదేశాల్లో ఇల్లు, కారు, రూమ్‌ రెంటల్స్‌కు వినియోగించుకోవద్దు.
► కార్డ్‌లో లోడ్‌ చేసిన కరెన్సీ కాకుండా, మరో కరెన్సీలో చెల్లింపులు చేయకుండా ఉండడమే మంచిది. దీనివల్ల అనవసర వ్యయాలను నివారించుకోవచ్చు.
► టోల్‌ చార్జీలు చెల్లించేందుకు సైతం ఫారెక్స్‌ కార్డ్‌ను వాడుకోవద్దు.
► కొన్ని బ్యాంక్‌లు తక్కువ మార్కప్, లోడింగ్‌ చార్జీతో క్రెడిట్‌ కార్డులను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిపై రివార్డులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇవి కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. కానీ, అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

దరఖాస్తుకు ముందు..
ఫారెక్స్‌ కార్డ్‌ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు ఆఫర్‌ చేస్తున్న పలు రకాల కార్డ్‌లు, వాటిల్లోని ఫీచర్లను పూర్తిగా తెలుసుకోవాలి. చార్జీల గురించి అడిగి తెలుసుకోవాలి. బ్యాంక్‌లు, పెద్ద ఆరి్థక సంస్థలు, ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీల నుంచి ఈ కార్డ్‌ తీసుకోవచ్చు. బ్యాంకు శాఖకు వెళ్లి లేదంటే ఆన్‌లైన్‌ నుంచి అయినా కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని సంస్థలు ఒకటికి మించిన కార్డ్‌లను వివిధ రకాల ఫీచర్లతో ఆఫర్‌ చేస్తున్నాయి.

కార్డ్‌ తీసుకునేందుకు కొన్ని రకాల డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్‌ కాపీ (స్వయంగా అటెస్ట్‌ చేసింది), వీసా కాపీ, ఎయిర్‌లైన్‌ టికెట్‌ కాపీ, పాన్‌ కార్డ్‌ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. డెబిట్‌ కార్డ్‌ మాదిరే ఫారెక్స్‌ కార్డుకు అనుబంధంగా పిన్‌ వస్తుంది. దీన్ని మొదటిసారి మార్చుకోవాలి. కార్డు జారీ చేసిన బ్యాంక్‌ ఏటీఎంకు వెళ్లి బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ నుంచి కూడా ఈ సదుపాయం ఉంది. ప్రతి లావాదేవీ అనంతరం వచ్చే ఎస్‌ఎంఎస్‌ను చూసి తెలుసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement