జూలై 21 నుంచి ఆగస్టు 12 దాకా వర్షాకాల సమావేశాలు | Impeachment motion against Yashwant Varma in Monsoon session | Sakshi
Sakshi News home page

జూలై 21 నుంచి ఆగస్టు 12 దాకా వర్షాకాల సమావేశాలు

Jun 5 2025 5:34 AM | Updated on Jun 5 2025 5:34 AM

Impeachment motion against Yashwant Varma in Monsoon session

జస్టిస్‌ వర్మ అభిశంసనకు తీర్మానం 

అందుకు చర్యలు చేపడతాం: కేంద్రం 

ప్రతి పార్టీతోనూ చర్చిస్తున్నాం: రిజిజు 

‘ప్రత్యేక భేటీ’కి మోదీ సర్కారు భయపడింది 

అందుకే ముందస్తుగా తేదీల ప్రకటన: విపక్షాలు

సాక్షి, న్యూఢిల్లీ: అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు దొరికిన ఉదంతంలో ఆయన అభిశంసనకు చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు బుధవారం ప్రకటించారు. 

జూలై 21 నుంచి ఆగస్టు 12 దాకా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సారథ్యంలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్, తదనంతర పరిణామాలపై సమగ్ర చర్చ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్‌తో పాటు 16 విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారమే లేఖ రాయడం తెలిసిందే. 

ఈ డిమాండ్‌పై రిజిజు స్పందిస్తూ ప్రభుత్వానికి ప్రతి సమావేశాలూ ప్రత్యేకమేనన్నారు. విపక్షాలు కోరుతున్న అన్ని అంశాలనూ వర్షాకాల సమావేశాల్లో చర్చకు చేపట్టవచ్చని సూచించారు. కానీ పార్లమెంటు ప్రత్యేక భేటీ నుంచి మోదీ సర్కారు పారిపోయిందని కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు ఎద్దేవా చేశాయి. అందుకే వర్షాకాల భేటీల తేదీలను ఏకంగా 47 రోజుల ముందు వెల్లడించిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. కేంద్రానికి పార్లమెంటోఫోబియా పట్టకుందని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రియాన్‌ విమర్శించారు. 

ఏకగ్రీవంగా ‘అభిశంసన’ 
జస్టిస్‌ వర్మ అభిశంసనకు వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం లభిస్తుందని రిజిజు ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘న్యాయవ్యవస్థలో అవినీతిని రాజకీయ దృక్కోణం నుంచి చూడలేం. అందుకే అభిశంసన తీర్మానాన్ని పార్టీలన్నీ ఏకగ్రీవంగా ప్రవేశపెట్టాలన్నది కేంద్రం ఉద్దేశం. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయతి్నస్తున్నాం. ప్రధాన పార్టీలకు ఇప్పటికే నేను స్వయంగా మేరకు సమాచారమిచ్చా. చిన్న పార్టీలను కూడా సంప్రదిస్తున్నా’’అని మంత్రి తెలిపారు. తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలో నిర్ణయించాల్సి ఉందన్నారు. 

న్యాయమూర్తుల (విచారణ) చట్టం ప్రకారం తీర్మానాన్ని సభ అనుమతించాక అభియోగాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో సభాపతి ఒక కమిటీని నియమిస్తారు. అందులో భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రఖ్యాత న్యాయ కోవిదుడు సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీ సమరి్పంచే నివేదికపై సభ చర్చించిన అనంతరం అభిశంసన ప్రక్రియ చేపడుతుంది. అయితే జస్టిస్‌ వర్మ ఉదంతంపై సీజేఐ కమిటీ ఇప్పటికే నివేదిక సమరి్పంచిందని రిజిజు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో కూలంకషంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement