సింపోజియంలో బజాజ్ ఫిన్‌సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్(కుడివైపు), బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ సీఈవో గణేష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ, డెట్ మార్కెట్లలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. బడా ఎకానమీల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేస్తోంది. డెమోగ్రాఫిక్స్, మహిళా శ్రామిక శక్తి పెరగడం తదితర సానుకూల అంశాలతో మధ్యకాలికంగానూ ఇదే ధోరణిని కొనసాగించనుంది. అలాగే, అంతర్జాతీయంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకుని, నిలవగలిగేలా ఫారెక్స్ నిల్వలను పెంచుకుంది.
ద్రవ్య లోటు అధికంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే దిశగా ఆర్థిక క్రమశిక్షణ బాటలో పురోగమిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు భారీ స్థాయి పన్ను వసూళ్లు తోడ్పడనున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన సింపోజియంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సింపోజియంనకు సంబంధించిన మరిన్ని విశేషాలు..
► వర్ధమాన దేశాల్లో భారత మార్కెట్ అధిక ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. ఇటీవలి కాలంలో ఈ ప్రీమియం గణనీయంగా పెరిగింది. అయితే, రాబడుల నిష్పత్తి మెరుగ్గా ఉండటం, అధిక వృద్ధికి ఆస్కారం ఉండటం వంటి అంశాలు ఇందుకు న్యాయం చేకూరుస్తున్నాయి. వృద్ధి రేటుపరంగా చూస్తే వేల్యుయేషన్లు సముచితంగానే కనిపిస్తున్నాయి. మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఆకర్షణీయ స్టాక్స్ కన్నా పటిష్టమైన వ్యాపారాలను ఎంచుకోవడం ముఖ్యం.
► ప్రైవేట్ వినియోగం, ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత కార్పొరేట్ సంస్థలు తమ సామరŠాధ్యలను విస్తరించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. కొత్త ఫ్యాక్టరీలు, రోబోటిక్స్, ఆటోమేషన్, టెక్నాలజీ మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు కూడా మెరుగుపడుతుండటంతో పెట్టుబడులకు అవసరమైన నిధులకు పెద్దగా కొరత లేదు.
► దేశీయంగా వినియోగ డిమాండ్ మెరుగుపడుతోంది. 2023లో తలసరి ఆదాయం 2,500 డాలర్ల మార్కును దాటింది. దీనితో చైనా, బ్రెజిల్, దక్షిణ కొరియా వంటి ఇతరత్రా వర్ధమాన మార్కెట్లలో కనిపించిన విధంగానే విచక్షణ ఆధారిత వినియోగం పెరిగే అవకాశం ఉంది. కార్లు, రియల్ ఎస్టేట్ మొదలైన వాటిల్లో ప్రీమియం ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగవచ్చు.
► మ్యుచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా మార్కెట్లలోకి గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయి. దేశీయంగా క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగానే ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మార్కెట్లలో పెట్టుబడుల వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి.
రిస్కులు ఉన్నాయి..
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహం, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
► సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే రాజకీయ అస్థిరతకు దారి తీయొచ్చు. అయితే, ఇందుకు అవకాశాలు చాలా తక్కువే కనిపిస్తున్నాయి.
► వాతావరణ మార్పుల వల్ల గ్రామీణ ఎకానమీ పుంజుకోవడానికి మరింత జాప్యం జరగవచ్చు. దీనితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి తోడ్పాటునిచ్చేందుకు కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాల్సి రావచ్చు.
రంగాలవారీగా అంచనాలు ఇలా..
► బ్యాంకింగ్: డిమాండ్ పెరిగే కొద్దీ బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు మెరుగుపడుతోంది. నిరర్థక ఆస్తులు తగ్గుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టనుండటంతో నికర వడ్డీ మార్జిన్లు కొంత దిగిరావచ్చు. బ్యాంకింగ్ వేల్యుయేషన్ సముచిత స్థాయిలోనే ఉంది.
► కన్జూమర్: గ్రామీణ ప్రాంతాల్లో బలహీన డిమాండ్ కారణంగా వినియోగ వస్తువుల విక్రయాలకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా మటుకు కంపెనీలు పుంజుకునేందుకు సకాల వర్షాలు కీలకంగా నిలుస్తాయి. అయితే, విచక్షణాధారిత వినియోగానికి సంబంధించి అఫోర్డబుల్ సెగ్మెంట్‌లతో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్లు మెరుగ్గా రాణించవచ్చు.
► ఐటీ సేవలు: సంపన్న దేశాల్లో మందగమనం రావచ్చన్న అంచనాల వల్ల గ్లోబల్ కంపెనీలు ఐటీపై చేసే వ్యయాలపై ప్రభావం పడుతోంది. దీంతో డిమాండ్ బలహీనంగా కనిపిస్తోంది. సరఫరాపరమైన ఆందోళనలు తొలగిపోవడంతో ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గాయి.
► ఫార్మా: అమెరికాలో ఔషధాల కొరత అనేది ఎగుమతి ఆధారిత ఫార్మా కంపెనీలు సైక్లికల్‌గా పుంజుకోవడానికి తోడ్పడుతోంది. ముడివస్తువుల ధరలు తగ్గుతుండటంతో మార్జిన్లు మెరుగ్గా ఉండవచ్చు.
సింపోజియంలో బజాజ్ ఫిన్‌సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్(కుడివైపు), బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ సీఈవో గణేష్
Comments
Please login to add a commentAdd a comment