న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు భారీ అస్థిరతల మధ్య చలిస్తున్నా కానీ, ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో చలించడం లేదు. ఆగస్టు నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.8,231 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన సిప్ పెట్టుబడులతో పోలిస్తే 7.5 శాతం అధికం. దీంతో కలిపితే ఈ ఆరి్థక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) సిప్ ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.41,098 కోట్లుగా ఉన్నాయి. గత ఆరి్థక సంవత్సరం తొలి ఐదు నెలల్లో వచ్చిన రూ.36,760 కోట్లతో పోల్చి చూసుకుంటే 12 శాతం వృద్ధి చోటు చేసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ‘యాంఫి’ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లకు సిప్ మార్గం అనుకూలంగా ఉన్నట్టు యాంఫి పేర్కొంది. అయితే, ఈ ఏడాది జూలైలో సిప్ ద్వారా ఈక్విటీ పథకాల్లోకి వచి్చన రూ.8,324 కోట్లతో పోలిస్తే... ఆగస్టు మాసంలో వచ్చిన సిప్ పెట్టుబడులు (రూ.8,231 కోట్లు) కొంచెం తగ్గినట్టు తెలుస్తోంది. ఇక జూన్‌లో రూ.8,122 కోట్లు, మే నెలలో రూ.8,183 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,238 కోట్ల చొప్పున సిప్ మార్గంలో పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఆగస్టు వరకు అంతక్రితం 12 నెలలుగా చూసుకుంటే ప్రతీ నెలలోనూ సగటున రూ.8,000 కోట్ల మేర సిప్ పెట్టుబడులు ఉండడం నిలకడను సూచిస్తోంది.
ఇక ఈ నెలలోనూ ఈక్విటీ పథకాల్లోకి సిప్ పెట్టుబడుల రాక బలంగానే ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ మాత్రం అస్థిరతలు ఎదుర్కోవచ్చని అంచనా. 2016–17లో రూ.43,900 కోట్లు, 2017–18లో రూ.67,000 కోట్లు, 2018–19లో రూ.92,700 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం వివిధ పథకాల పరిధిలో 2.81 కోట్ల సిప్ ఖాతాలు నడుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రతీ నెలా సగటున 9.39 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment