ఈక్విటీలో ఈపీఎఫ్ఓ పెట్టుబడి సరైనదేనా? | deerendra kumar advices for finacial and business probloms | Sakshi
Sakshi News home page

ఈక్విటీలో ఈపీఎఫ్ఓ పెట్టుబడి సరైనదేనా?

Published Mon, Oct 24 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ఈక్విటీలో ఈపీఎఫ్ఓ పెట్టుబడి సరైనదేనా?

ఈక్విటీలో ఈపీఎఫ్ఓ పెట్టుబడి సరైనదేనా?

ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) 5 శాతం నుంచి 10 శాతానికి పెంచనున్నదని ఇటీవలే ఒక వార్త చదివాం. ఇలా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెంచడం వల్ల  ఈపీఎఫ్‌ఓ సభ్యులుగా మాకేమైనా ప్రయోజనం కలుగుతుందా ? స్టాక్ మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. కాబట్టి నష్టాలు వస్తే, ఆ ప్రభావం మాకు వచ్చే రాబడులపై ఏమైనా ఉంటుందా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఒడిదుడుకులుంటాయి కాబట్టి ఆందోళన చెందుతున్నాం. సరైన వివరణ ఇవ్వండి?  - రమేశ్, సురేశ్, హైదరాబాద్

 ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడం వల్ల మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ ఈక్విటీల్లో పెట్టుబడులను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల ఈపీఎఫ్‌ఓకు దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయని చెప్పవచ్చు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై గత ఏడాది ఈపీఎఫ్‌ఓకు 13.24 శాతం రాబడులు వచ్చాయి. ఈ రాబడులు, దీనిపై చక్రవడ్డీ కలుపుకొని మీకు, మీరు రిటైరయ్యేనాటికి మంచి రాబడులు వచ్చే అవకాశాలున్నాయి.

5-7 ఏళ్ల కాలానికి మించి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయని భావిస్తున్నాం. కాకుంటే ఈక్విటీ మార్కెట్లో ఎక్కువగా ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈక్విటీల్లో ఈపీఎఫ్‌ఓ ఇన్వెస్ట్‌మెంట్స్ వద్దని విమర్శకులు అంటూ ఉంటారు. స్వల్పకాలంలో ఈక్విటీలు ఒడిదుడుకులకు గురవుతాయనే విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. కానీ దీర్ఘకాలంలో మాత్రం మంచి రాబడులే వస్తాయి. ఉదాహరణకు గత పదేళ్ల కాలంలో వివిధ ఇన్వెస్ట్‌మెంట్ విధానాల్లో రాబడులను చూస్తే, పదేళ్ల క్రితం రూ.లక్ష ను ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుతం రూ.2.48 లక్షలు వస్తాయి. ఇదే లక్షను నిఫ్టీ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రూ.3.9 లక్షల వరకూ వచ్చేవి. ఈ పదేళ్ల కాలంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తడం, దీర్ఘకాలం పాటు మార్కెట్ స్తబ్ధుగా ఉండటం వంటి ప్రతికూలతలు ఉన్నా, ఈక్విటీలు మంచి రాబడులనే ఇచ్చాయి. అందుకని దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయని చెప్పొచ్చు.

 నేను ఒక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ప్లాన్ అంతంత మాత్రమే రాబడులను ఇచ్చింది. ఈ యులిప్ నుంచి వైదొలుగుదామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా?    - కౌశిక్, విశాఖపట్టణం

 ఈ తరహా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)లో ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించడం సరైన నిర్ణయం కాదు. మీ భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవాలంటే ఈ యులిప్ నుంచి వైదొలగడమే మంచిది. ఈ యులిప్ నుంచి బయటకు రావాలన్న మీ నిర్ణయం సరైనదే. యులిప్‌లు భారీగా చార్జీలను వసూలు చేస్తాయి. ముఖ్యంగా ఈ ప్లాన్‌ల ప్రారంభ సంవత్సరాల్లో ఈ చార్జీల వడ్డింపు అధికంగానే ఉంటుంది. అందుకని మీరు చెల్లించే ప్రీమియమ్ నుంచి ఈ చార్జీలన్నింటినీ మినహాయిస్తే, మీ నికర ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఫలితంగా మీకు వచ్చే రాబడులు కూడా తక్కువగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ మంచి పనితీరు కనబరిచినప్పటికీ, అధిక చార్జీల భారం కారణంగా మీరు పొందే రాబడులు చెప్పుకోదగిన స్థాయిలో ఉండవు. అందుకని భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్, బీమా కలగలసిన పాలసీల్లో ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా కోసం ఆన్‌లైన్ టర్మ్ బీమా పాలసీలు తీసుకోండి. వీటిల్లో ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటాయి. ఇక పిల్లల చదువు, రిైటైర్మెంట్ అవసరాలు, సొంత ఇల్లు అమర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం (కనీసం ఐదేళ్లకు మించి) ఇన్వెస్ట్ చేయండి.

 నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. రూ.5 లక్షల వరకూ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ నెలా నెలా కొంత మొత్తం నా జీతంలో కోత విధిస్తున్నారు.  ఇది కాకుండా మరో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మేలని మిత్రులంటున్నారు. మరో హెల్త్ పాలసీ తీసుకోవలసిన అవసరం ఉందా? - కార్తీక్, వరంగల్

 మీకు మీ కంపెనీ తరపున మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, మరో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిదే. మీరు సదరు కంపెనీలో కొనసాగినంత వరకే మీ కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఏదైనా కారణాల వల్ల మీరు ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తే ఈ పాలసీ వర్తించకపోయే అవకాశాలు ఉండవచ్చు.  మీరు ఉద్యోగం వదిలివేసినా, లేదా రిటైరైనా ఈ పాలసీ వర్తించదు. రిటైరైన తర్వాతనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అవసరం అధికంగా ఉంటుంది.  ఇక 50 దాటాకా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం వల్ల  పెద్దగా ప్రయోజనం ఉండదు. అప్పటికే ఏవైనా రోగాలుంటే వాటికి కవరేజ్ ఉండదు. మీ కంపెనీ ద్వారా మీరు తీసుకున్న బీమా పాలసీ మీ కుటుంబ సభ్యులందరినీ కవర్  చేసేలా ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. అందుకని మీ కుటుంబ సభ్యులందికీ వర్తించేలా ఒక సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement