
స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు
⇒ రూ.18,000 కోట్లు
⇒ ఈటీఎఫ్‌ల్లోనే ఇన్వెస్ట్‌మెంట్స్.. షేర్లలో కాదు
⇒ ఈ నెల 31 వరకూ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్
⇒ వెల్లడించిన కార్మిక మంత్రి దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకూ ఈటీఎఫ్‌లలో (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్) రూ.18,609 కోట్లు పెట్టుబడులు పెట్టింది. నిఫ్టీ 50, సెన్సెక్స్, సీపీఎస్‌ఈ ఆధారిత ఈటీఎఫ్‌ల్లోనే ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెట్టిందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అంతేకానీ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయలేదని రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
గత నెల 18 వరకూ నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీ ఆధారిత ఈటీఎఫ్‌ల్లో రూ.17,105 కోట్లు, సీపీఎస్‌ఈలో (సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్) రూ.1,504 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి మరింతమంది సభ్యులను చేర్చుకునే ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమైందని, ఈ నెల 31 వరకూ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ సంస్థ/కంపెనీ అయినా ఒక డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా తమ ఉద్యోగులను ఈపీఎఫ్‌ఓలో చేర్చవచ్చని సూచించారు.