న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే తాజాగా కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్‌కు ఉద్వాసన పలికింది. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన అభియోగాలతో బోర్డు నుంచి ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. మాధురికి గతంలో కేటాయించిన ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు(ఇసాప్స్) సైతం కంపెనీ రద్దు చేసింది. కంపెనీ నిధులను వ్యక్తిగత సౌందర్య చికిత్సలకు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు, కుటుంబ ప్రయాణాల(యూఎస్, దుబాయ్)కు వెచ్చించినట్లు వెలువడిన ఆరోపణలతో మాధురిపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కంపెనీ ఖాతాల నుంచి వ్యక్తిగత సిబ్బందికి చెల్లింపులు, స్నేహపూరిత పార్టీలకు నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశాయి. వీటిపై మాధురి స్పందించవలసి ఉండగా.. 22 నుంచి ఈమెను సర్వీసుల నుంచి తొలగించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అయితే కారణాలు వెల్లడించలేదు.
సమీక్ష ఎఫెక్ట్
భారత్‌పే బోర్డు బయటి వ్యక్తులతో నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో తాజా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. రిస్క్‌ల సలహా సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ ద్వారా కంపెనీ పాలనాపరమైన సమీక్షకు తెరతీసింది. రహస్యంగా ఉంచవలసిన సమాచారాన్ని తండ్రి, సోదరులకు మాధురి వెల్లడించినట్లు ఈ సమీక్షలో తేలిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా కొన్ని థర్డ్‌పార్టీల ఇన్‌వాయిస్ సంబంధిత అవకతవకలు జరిగినట్లు తెలియజేశాయి. అన్ని బిల్లులను ఆమె ఆమోదించినట్లు పేర్కొన్నాయి. 2018 అక్టోబర్ నుంచి కంపెనీ ఫైనాన్షియల్ ఇన్‌చార్జిగా మాధురి వ్యవహరించారు. కాగా.. కొటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిపై దుర్భాషలాడటంతోపాటు, ఆర్థిక అవకతవకలకు పాల్పడిన అభియోగాల నేపథ్యంలో మాధురి భర్త గ్రోవర్ సైతం మూడు నెలల సెలవుపై వెళ్లారు. అయితే వీటిని గ్రోవర్ తోసిపుచ్చారు. భర్త గ్రోవర్ సెలవుపై వెళ్లిన కొద్ది రోజుల్లోనే మాధురి సైతం సెలవుపై వెళ్లడం గమనార్హం!
మాధురీ జైన్‌కు భారత్‌పే షాక్
Published Thu, Feb 24 2022 6:26 AM | Last Updated on Thu, Feb 24 2022 6:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment