బిలియనీర్ బిల్ గేట్స్ ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ళ దాంపత్య జీవితానికి అధికారికంగా స్వస్తి చెప్పారు. అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నారు. ‘విడిపోవడం ప్రేమకు కొనసాగింపు’ అని మన కవులు అంటుంటారు. అలాంటిదే ఈ పరిణామం.! 27 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత అకస్మాత్తుగా మే నెలలో విడిపోతున్నట్లు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల తర్వాత వారి నిర్ణయాన్ని అంగీకరిస్తూ వాషింగ్టన్ కు చెందిన కింగ్ కౌంటీ న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. దీంతో బిల్ గేట్స్, మెలిందా గేట్స్ బంధానికి అధికారికంగా ముగింపు పలికినట్లైంది.
మే నెలలో బిల్‌గేట్స్ - మెలిందాలు తాము విడిపోతున‍్నట్లు, విడాకుల కోసం కింగ్ కౌంటీ కోర్ట్‌ను ఆశ్రయిస్తున్నట్లు చెప్పి ప్రపంచానికి షాకిచ్చారు. దీంతో వారు విడిపోవడంపై రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట‍్టాయి. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్ దంపతుల విడాకులు మరోమారు చర్చకు దారితీశాయి.. అమెరికా చట్టాల ప్రకారం డివోర్స్ కావాలంటే మూడు నెలలు ఎదురు చూడాల్సి ఉంది. అందుకే బిల్‌గేట్స్ దంపతులు విడాకుల కోసం ఇంతకాలం ఎదురు చూశారు.
సోమవారంతో ఆ గడువు పూర్తి కావడంతో కింగ్ కౌంటీ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. బ్లూం బెర్గ్ బిలినియర్ ఇండెక్స్ ప్రకారం.. విడాకులతో సుమారు 152 బిలియన్ల డాలర్లుగా ఉన్న బిల్ గేట్స్ ఆస‍్తిని ఎలా పంచుకుంటారో తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను ఫ్రెంచ్ గేట్స్కి బదిలీ చేసినట్టు అమెరికన్ మీడియా 'టీఎంజీ' తన కథనంలో పేర్కొంది.
ఇక వాషింగ్టన్ న్యాయ నిబంధనల ప్రకారం.. వివాహ సమయంలో ఆస్తులు,ఇతర వ్యవహారాల్లో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారో.. విడిపోయే సమయంలో కూడా ఆ నిబంధనలపై కట్టుబడి ఉండాలి. వాటికి లోబడే బిల్‌గేట్స్-మెలిందా గేట్స్ ఆస్తుల్ని పంచుకోవాలని న్యాయమూర్తి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ ఆస్తి ఇద్దరికీ సమంగా పంపిణీ చేస్తే ఒక్కొక్కరి ఆస్తి సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment