Bitcoin Crash Effect Thousands Of Investors Vanished: బిట్‌కాయిన్.. క్రిప్టోకరెన్సీలో అత్యంత విలువైంది. దీని దరిదాపుల్లో మరే కరెన్సీ లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి వీటికి నమ్ముకున్న వాళ్లకు అదృష్టం కలిసొచ్చి.. ఇప్పుడు విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యకాలంలో పరిణామాలతో బిట్‌కాయిన్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది!. ప్రస్తుతం ఇది చేస్తున్న నష్టం మాత్రం మామూలుగా ఉండడం లేదు.
సుమారు 30 వేలమంది బిట్‌కాయిన్ మిలియనీర్లు క్రిప్టో మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయారు. కారణం.. గత మూడు నెలల్లో బిట్‌కాయిన్ డిజిటల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు. నవంబర్‌లో 69,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ తాజాగా(గురువారం) 36,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీపై పలు దేశాల నియంత్రణ పరిశీలన, భౌగోళిక రాజకీయ అశాంతి, అల్లకల్లోలం అవుతున్న మార్కెట్లు, కరోనా పరిస్థితుల వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఫిన్బోల్డ్ అనే పోర్టల్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ ఉన్న బిట్‌కాయిన్ కలిగి ఉన్న వాలెట్లు 28,186( 24.26 శాతం) తగ్గాయి. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో గతంలో బిట్‌కాయిన్ ద్వారా ధనవంతులైన ఎంతో మంది.. భారీ నష్టంతో బికారీలుగా మారిపోయారు. అంతేకాదు ‘‘1,00,000డాలర్లు కంటే ఎక్కువ ఉన్న వాలెట్లు 30.04 శాతం పడిపోయి 505,711 నుండి 353,763కి చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్, అంతకు మించి ఉన్నవి 105,820 నుండి 80,945కి 23.5 శాతం పడిపోయి 80,945కి పడిపోయింది. 10 మిలియన్ల డాలర్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాలెట్లు కూడా 32.08 శాతం తగ్గి 10,319 నుండి 7,008కి పడిపోయాయి’’ అని ఫిన్బోర్డ్ నివేదిక పేర్కొంది.
అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా బిట్‌కాయిన్‌ను అభివర్ణిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. బిట్‌కాయిన్ చేస్తున్న డ్యామేజ్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్తూ.. ముందు మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు కనిష్టానికి చేరుకోవడంతో పాటు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లజేశాయి మరి!.
బిట్‌కాయిన్ బ్యాడ్ టైం.. మిలియనీర్ల నుంచి బికారీలుగా మారిన వేలమంది!
Published Thu, Jan 27 2022 3:03 PM | Last Updated on Thu, Jan 27 2022 3:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment