హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ అందిస్తున్న కెనడా సంస్థ బ్లాక్‌బెర్రీ భారత్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. 2023 చివరి నాటికి కెనడా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బెర్రీ ఐవోటీ విభాగానికి రెండవ అతిపెద్ద కేంద్రంగా ఇది అవతరిస్తుందని వెల్లడించింది. ఆ సమయానికి ఇక్కడ 100 మందికి పైగా ఎంబెడ్డెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది.
సాఫ్ట్‌వేర్ ద్వారా నియంత్రించగలిగే తదుపరి తరం వాహనాల అభివృద్ధి, ఐవోటీ పరిశ్రమలో ఆధునిక ఆవిష్కరణలు లక్ష్యంగా ఈ కేంద్రం బ్లాక్‌బెర్రీ రూపొందించిన క్యూఎన్‌ఎక్స్, ఐవీ ఉత్పాదనలపై పనిచేస్తుంది. ఆవిష్కరణలు, ఎంబెడ్డెడ్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ బాధ్యతలను హైదరాబాద్ బృందం చేపడుతుంది. ‘నైపుణ్యాలు, ఆవిష్కరణలలో బ్లాక్‌బెర్రీ కొనసాగిస్తున్న పెట్టుబడికి ఈ రోజు మరొక మైలురాయి.
ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్ ఆవిష్కర్తలకు నిలయంగా భారత ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో ఐవోటీ సాప్ట్‌వేర్ లీడర్‌గా వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తాం’ అని బ్లాక్‌బెర్రీ ఐవోటీ ప్రెసిడెంట్ మ్యాటిస్ ఎరిక్సన్ తెలిపారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టెల్లాంటిస్, బీఎండబ్లు్య, బాష్, ఫోర్డ్, జీఎం, హోండా, మెర్సిడెస్ బెంజ్, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ వంటి సంస్థలు బ్లాక్‌బెర్రీ క్లయింట్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల వాహనాల్లో బ్లాక్‌బెర్రీ క్యూఎన్‌ఎక్స్ వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment