ముంబై: బడ్జెట్ మరుసటి రోజూ మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్–2022పై పలువురు విశ్లేషకులు సానుకూలంగా స్పందించడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఆర్థిక రికవరీ వేగం మరింత పుంజుకునేందుకు మౌలికరంగానికి పెద్దపీట వేయడంతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారీ మూలధన వ్యయాన్ని కేటాయించడాన్ని స్టాక్ మార్కెట్ స్వాగతించిందని ట్రేడర్లు పేర్కొన్నారు.
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 696 పాయింట్లు పెరిగి 59,558 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో 17,780 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడో లాభాల ముగింపు. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు సంపూర్ణ కొనుగోళ్ల మద్దతు లభించింది. బడ్జెట్ రోజున స్తబ్ధుగా ట్రేడైన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది.
ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు.., తర్వాత కోలుకొని మార్కెట్ ముగిసే దాకా ర్యాలీని కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్ 757 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మధ్య, చిన్న తరహా షేర్లకు భారీగా డిమాండ్ లభించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఒకటిన్నర శాతం చొప్పున లాభపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆరంభ లాభాలను కోల్పోయి ఒక పైసా స్వల్ప లాభంతో 74.83 వద్ద స్థిరపడింది.
విదేశీ ఇన్వెస్టర్లు రూ.184 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.426 కోట్ల షేర్లను కొన్నారు. కార్పొరేట్లు మెరుగైన ఆదాయాలను ప్రకటన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా లునార్ కొత్త ఏడాది సందర్భంగా ఈ దేశ మార్కెట్‌తో పాటు హాంగ్‌కాంగ్, కొరియా స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ స్టాక్ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడింది. యూరప్ మార్కెట్లూ రాణించాయి.
‘‘కేంద్రం బడ్జెట్‌పై ఆశావాదంతో మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. రానున్న రోజుల్లో మార్కెట్‌కు ప్రపంచ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి. ఒపెక్ సమావేశ నిర్ణయాలు, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. సానుకూలతలు ఎన్ని నెలకొన్నప్పటికీ.., నిఫ్టీ పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతోంది. సాంకేతికంగా 18,000–18,300 శ్రేణిలో కీలక ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు రాణించే అవకాశం ఉంది’’ జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు.
మూడు రోజుల్లో రూ.9.57 లక్షల కోట్ల సంపద
గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 2,358 పాయింట్లు ర్యాలీ చేయడంతో రూ.9.57 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సూచీల ఒకశాతం లాభంతో బుధవారం ఒక్కరోజే రూ.2.67 కోట్లు ఇన్వెస్టర్ల సొంతమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.270 లక్షల కోట్లకు చేరింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► రుణాన్ని ఈక్విటీ రూపంలో మార్చే ప్రణాళికను ఉపసంహరించుకోవడంతో టాటా టెటిసర్వీసెస్ షేరు 5 శాతం లాభపడి రూ.149 వద్ద స్థిరపడింది.
► కేర్ రేటింగ్ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో వోడాఫోన్ ఐడియా షేరు ఏడు శాతం లాభపడి రూ.11 వద్ద స్థిరపడింది.
► మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏడు శాతం దిగివచ్చి 18.65 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment