ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పునర్వైభవాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు టెలికం సంస్థలు టారిఫ్‌లను పెంచడంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. దీనికితోడు కేంద్ర బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించడంతో మరింత వినియోగదారులు ఇటువైపు వస్తారని ఇక తిరుగుండదని భావిస్తున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికాం ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపులో సింహభాగం నిధులు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సంబంధిత ఖర్చుల కోసమే కేటాయించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లు కేటాయించడం విశేషం.
“బడ్జెట్ అంచనా 2024-25లో ఈ డిమాండ్ కోసం మొత్తం నికర కేటాయింపు రూ.1,28,915.43 కోట్లు ( రూ.1,11,915.43 కోట్లు, మరో రూ.17,000 కోట్లతో కలిపి). ఇందలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద లభించే నిల్వల నుంచి రూ.17,000 కోట్ల అదనపు కేటాయింపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు పరిహారం, భారత్‌నెట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వంటి పథకాలకు ఉద్దేశించినది” అని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు.
ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్‌ఎన్‌ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్‌స్టాల్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు బడ్జెట్ కేటాయింపులు మరింత ఊపును ఇవ్వనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment