ప్రచారంలో ఎప్పుడూ కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. నలుగురిలోకి తమ ప్రొడక్టును తీసుకెళ్లేందుకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటాయి కంపెనీలు. ఈ క్రమంలో ఇంత వరకు చూడని కొత్తదనం పరిచయం చేస్తుంటాయి. ఈ క్రమంలో వాణిజ్య ప్రకటనల్లో లేటెస్ట్ ఎట్రాక‌్షన్‌గా వచ్చి చేరింది బుర్జ్ ఖలీఫా.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డులెక్కింది దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా. ఈ భవనం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి లక్షల మంది టూరిస్టులను ఆకర్షించింది. ఎన్నో సినిమా షూటింగ్‌లకు వేదికగా మారింది. ఇలా రోజురోజుకి బుర్జ్ ఖలీఫా క్రేజ్ పెరిగిపోతుంది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బూర్జ్ ఖలీఫా గురించి చెప్పుకుంటారు. మరి ఆ భవనం చిట్టచివర నిలబడి ఏదైనా వస్తువు గురించి ప్రచారం చేస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో ముందుకు వచ్చింది ఓ విమానయాన సంస్థ. ఎంతో రిస్క్ చేసి అనేక జాగ్రత్తలు తీసుకుని ఓ మోడల్‌ని ఎయిర్‌హోస్టెన్ గెటప్ వేయించి ఆ భవనం అంచున నిల్చోబెట్టి యాడ్ షూట్ చేసింది.
వందల మీటర్ల ఎత్తులో బూర్జ్ ఖలీఫా చిట్ట చివరన కేవలం నిలబడేందుకు మాత్రమే సరిపడే చోటు ఉన్న స్థలంలో మోడల్‌ని నిలబెట్టి షూట్ చేయడం వివాస్పదమైంది. మీ ప్రచారం కోసం మనిషి ప్రాణాలను రిస్క్‌లో పెడతారా అంటూ ఆ యాడ్‌పై విమర్శలు వచ్చాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా బోలెడంత ప్రచారం దక్కింది. దీంతో దుబాయ్ ఎక్స్‌పో 2020 టీం సైతం సేమ్ కాన్సెప్ట్‌ని ఫాలో అయ్యింది. నెలల తరబడి సాగుతున్న ఈ ఎక్స్‌పోను ఉద్దేశించి ‘మీ కోసం ఇంకా ఇక్కడే ఉన్నాను. మీకు వెల్‌కమ్’ అని చెబుతూ యాడ్ వదిలింది. భారీ ప్రచారం దక్కించుకుంది.
ఇక ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మార్కెట్ భారత్. దీంతో ఇండియాలో తమ వస్తువుల ప్రచారానికి బూర్జ్ ఖలీఫానే ఎంచుకుంది ఓ శీతల పానీయం కంపెనీ. సౌతిండియా స్టార్‌గా ఉంటూనే ఆలిండియా కమర్షియల్స్ యాడ్స్‌లో నటిస్తున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబుని ఈ యాడ్‌కి ఎంపిక చేసుకుంది. బుర్జ్ ఖలీఫా చిట్ట చివరకు సూపర్‌స్టార్‌ను తీసుకెళ్లి .. అక్కడి నుంచి ఓ ఎడ్వెంచర్ బైక్ రైడ్ కాన్సెప్ట్‌తో యాడ్ వదిలింది. ఇప్పుడది ఇండియాలో సెన్సెషన్‌గా మారింది.
కమర్షియల్ యాడ్స్‌కే కాదు సినిమా ట్రైలర్స్, న్యూ ప్రొడక్ట్స్ లాంఛింగ్, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల బర్త్‌డేలు, పలు ఈవెంట్స్‌ని సైతం బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం కామన్‌గా మారింది. ఇలాంటి ప్రదర్శనలకు భారీగానే ఖర్చు అవుతుంది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య 3 నిమిషాల పాటు ఏదైనా బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించాలంటే రూ. 50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. వారాంతాల్లో అయితే ఇది ఏకంగా రూ.70 లక్షల వరకు ఉంటోంది.
బూర్జ్ ఖలీఫా నిర్మించే సమయంలో ఎత్తైన భవనంగా రికార్డు సృష్టిస్తుంది. పర్యాటకులను ఆకర్షిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. కానీ కమర్షియల్ యాడ్స్‌కి కేరాఫ్ అడ్రస్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే బుర్జ్ ఖలీఫా క్రేజ్ మొత్తం సీన్‌ని మార్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment