ముందు రోజు నమోదైన భారీ నష్టాలకు చెక్ పెడుతూ హుషారుగా కదులుతున్న మార్కెట్లలో ఉన్నట్టుండి సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు సిమెంట్ కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కోవిడ్-19కు విధించిన లాక్‌డవున్‌ల నుంచి నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సిమెంట్ రంగ కంపెనీలు మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సిమెంట్ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం.
జోరుగా..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఏసీసీ సిమెంట్ 6.25 శాతం జంప్‌చేసి రూ. 1,677 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,683 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. శ్రీ సిమెంట్ షేరు 6.7 శాతం దూసుకెళ్లి రూ. 21,780 వద్ద కదులుతోంది. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతం పెరిగి రూ. 4,623 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 4,628ను తాకింది. ఈ బాటలో రామ్‌కో సిమెంట్స్ 3.4 శాతం పుంజుకుని రూ. 781కు చేరింది. ఇంట్రాడేలో రూ. 782ను తాకింది. మంగళం సిమెంట్ సైతం 4.25 శాతం ఎగసి రూ. 205 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 207కు చేరింది. ఇతర కౌంటర్లలో డెక్కన్ సిమెంట్స్ 2.6 శాతం లాభంతో రూ. 325 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 330కు చేరింది. శ్రీ దిగ్విజయ్ 3 శాతంపైగా వృద్ధితో రూ. 66 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ సైతం 1 శాతం బలపడ్డాయి.
కారణాలేవిటంటే?
ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలించడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంట్‌కు రిటైల్ డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల 50 శాతం గ్రామాల నుంచి వృద్ధి కనిపించినట్లు చెబుతున్నారు. ఇది కోవిడ్-19 అన్‌లాక్, పండుగల సీజన్ కారణంగానే నమోదైనప్పటికీ ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మరింత మెరుగుపడే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇదేవిధంగా పట్టణ ప్రాంతాల నుంచి సైతం నెమ్మదిగా సిమెంట్ విక్రయాలు పుంజుకుంటున్నట్లు తెలియజేశారు. సిమెంటు రంగానికి ప్రధానంగా గ్రామీణ గృహాలు, మౌలిక సదుపాయాల రంగాలు జోష్‌నిస్తాయని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో అల్ట్రాటెక్, ఏసీసీ వంటి సిమెంట్ రంగ దిగ్గజాలు ఆకర్షణీయ పనితీరు చూపడంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment