న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలకు సంబంధించి యూజర్లు చేసే ఫిర్యాదులను ఇకపై ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. నిబంధనల మేరకు వాటికి పరిష్కారం చూపాల్సిందే. యూజర్ల హక్కులను గౌరవించాల్సిందే. ఇందుకు వీలుగా..సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల గ్రీవెన్స్ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాలపై యూజర్లు అప్పీల్‌కు వెళ్లేందుకు గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
తమ ముందుకు వచ్చిన అప్పీల్స్‌ను 30 రోజుల్లోపు అప్పిలేట్ కమిటీ పరిష్కరించాల్సి ఉంటుంది.కమిటీ నిర్ణయాలను సోషల్ మీడియా సంస్థలు అమలు చేయాలని సవరించిన ఇన్ఫర్మేషట్ టెక్నాలజీ ముసాయిదా నిబంధనలు, 2021 నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. నిబంధనలను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియా వేదికలు కొందరు సెలబ్రిటీలు, ఇతరుల ఖాతాలను బ్లాక్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ తాజా చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువే గ్రీవెన్స్ కమిటీలను ఏర్పాటు చేయవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ తెలిపింది. ప్రతిపాదిత నిబంధనల కింద సోషల్ మీడియా గ్రీవెన్స్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయంపై బాధిత వ్యక్తి 30 రోజుల్లోపు అప్పీలేట్ కమిటీ ముందు సవాల్ చేయవచ్చు.ఈ ముసాయిదా నిబంధనలపై జూన్ 22 వరకు అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అనంతరం వీటిని అమల్లోకి తీసుకురానుంది.
సోషల్ మీడియా సంస్థలకు 2021 మే 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రావడం తెలిసిందే. దీని కింద 50 లక్షలు అంతకుమించి యూజర్లు ఉన్న సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా ఒక సందేశం మొదట ఎక్కడ ఆరంభమైందో గుర్తించాల్సి ఉంటుంది. అలాగే, ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, నిబంధనల అమలును చూసేందుకు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాలని నాటి నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment