ముంబై: కోవిడ్-19 నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో టైల్స్ తయారీ కంపెనీల కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక రికవరీ బలపడటం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయక ప్యాకేజీలు, చౌక వడ్డీ రేట్లు, రియల్టీ రంగ ప్రోత్సాహకాలు వంటి సానుకూల అంశాలు ఈ రంగానికి జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి టైల్స్ తయారీ లిస్టెడ్ కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ సిరామిక్ టైల్స్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..
పథకాల ఎఫెక్ట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పట్టణ గృహకల్పనకు రూ. 18,000 కోట్లు అదనంగా కేటాయించారు. తద్వారా నిలిచిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. రియల్టీ రంగం పుంజుకుంటే.. స్టీల్, సిమెంట్, టైల్స్ తదితర అనుబంధ విభాగాలకూ డిమాండ్ పుడుతుందని తెలియజేశాయి. మరోపక్క చైనాపై యూఎస్, బ్రెజిల్ తదితర దేశాలు యాంటిడంపింగ్ డ్యూటీ విధించడం టైల్స్ పరిశ్రమకు బూస్ట్‌నిస్తున్నట్లు వివరించారు. చదవండి: (ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్)
షేర్ల జోరు
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కజారియా సిరామిక్స్ 4.7 శాతం జంప్‌చేసి రూ. 606 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సెరా శానిటరీవేర్ షేరు 7.3 శాతం దూసుకెళ్లి రూ. 2,900 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,937ను తాకింది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! ఈ బాటలో సొమానీ సిరామిక్స్ 9.4 శాతం ఎగసి రూ. 253 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరి 17న రూ. 252.50 వద్ద సాధించిన ఏడాది గరిష్టాన్ని అధిగమించింది. చదవండి: (చిన్న షేర్ల దన్ను- స్మాల్ క్యాప్ రికార్డ్)
Comments
Please login to add a commentAdd a comment