చండీఘర్‌కు చెందిన మోహిత్ అహ్లువాలియా, జగజ్యోత్ కౌర్ భార్యాభర్తలు. 2017 శీతాకాలంలో బాలికి విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ వెకేషన్ వీరికి అద్భుతమైన జ్ఞాపకాలను అందించడమే కాకుండా కొత్త ఆలోచనను రేకెత్తించింది.
నూతన ఆశ, ఆశయాలతో ఇంటికి వెళ్లిన ఆ దంపతులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. మోహిత్ అహ్లువాలియా సేల్స్ ప్రొఫెషనల్‌గా, జగజ్యోత్ కౌర్ హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేసేవారు.
ఈ చండీగఢ్ జంట 2019లో ‘రామే’ (raamae) అనే పేరుతో గృహపయోగ, జీవనశైలి వస్తువుల వ్యాపార సంస్థను స్థాపించారు. ఇది శిక్షణ పొందిన కళాకారులు తయారు చేసిన హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్ వస్తువులైన కుషన్ కవర్లు, టోట్ బ్యాగ్‌లు, క్విల్ట్‌లు, పర్సులను విక్రయిస్తుంది. రామే అనేది బాలినీస్ పదం. బాలినీస్ ప్రజల జీవన విధానాన్ని ఇది సూచిస్తుంది. రద్దీ, అస్తవ్యస్తమైన ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ ఆనందాన్ని పొందడం దీని అర్థం.
బాలి పర్యటనతో మలుపు
‘కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన బాలి పర్యటన నా జీవితానికి మలుపు. అక్కడ స్థానికులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న ఆదరణను గమనించాను. భారత్‌లోనూ హస్తకళా ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. అయితే విదేశాల్లో హస్తకళా ఉత్పత్తులకు ఉన్నంత ఆదరణ భారత్‌లో ఎందుకు ఉండటం లేదో ఆశ్చర్యంగా ఉంది’ అని జగజ్యోత్ కౌర్ ‘షి ద పీపుల్’ అనే ఆన్‌లైన్ మ్యాగజైన్‌తో పేర్కొన్నారు.
బ్లాక్ ప్రింటింగ్‌తో రూపొందించిన భారతీయ వస్త్రాలకు ఎంతటి ఆదరణ ఉందో బాలిలోని వీధుల్లో తిరుగుతున్నప్పుడు తెలుసుకున్నట్లు మోహిత్ ‘ది బెటర్ ఇండియా’తో చెప్పారు. డబ్బు పరంగానే కాకుండా కస్టమర్ల గౌరవం కూడా వాటికి అదే స్థాయిలో ఉందన్నారు. బాలిలో వాటికి గణనీయమైన డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ ఉత్పత్తులకు భారత్‌లో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
ఇంటికి వచ్చిన తర్వాత ఈ జంట చేతివృత్తుల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలని, బ్లాక్ ప్రింటింగ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లకు పైగా ఉన్న తమ కార్పొరేట్ కెరీర్‌ను విడిచిపెట్టారు. 2018లో జైపూర్ వెళ్లి స్థానిక కళాకారుల వద్ద బ్లాక్ ప్రింటింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత 2019లో రామే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం వారు క్విల్ట్‌లు, పర్సులు, పర్సులు, పిల్లో కవర్‌లతో సహా 60 విభిన్న ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు.
రూ. 4 లక్షలతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ప్రతి నెలా రూ.18 లక్షలు, ఏటా రూ. 2.16 కోట్ల మేర వ్యాపారం సాగిస్తోంది. రాజస్థాన్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్, గోవా, కేరళ, ఇంఫాల్, అస్సాం, మిజోరాం ప్రాంతాల నుంచి వీరికి ఆర్డర్‌లు వస్తున్నాయి. యూఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి కూడా వీరికి కస్టమర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment