స్టాక్‌మార్కెట్‌లో ఒడిదొడుకులు సహజం. ఏదైనా అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు మరింత ఎక్కువగా ఊగిసలాడుతాయి. అయితే మార్కెట్‌లో నిత్యం భారీగా అమ్మకాలపర్వం కొనసాగితే ఆ దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగుతుంది. దాంతో ఎక్స్ఛేంజ్ రెగ్యులేటరీలు కొత్త నిబంధనలు తీసుకొస్తాయి. ఫలితంగా కొంత నష్టాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటాయి. తాజాగా చైనా మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు స్టాక్ మార్కెట్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
చైనా వరుస అమ్మకాల ఒత్తిడిని కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కొవిడ్ అనంతరం అక్కడి మార్కెట్ వెళ్లిన జీవనకాల గరిష్ఠాల నుంచి క్రమంగా చైనా, హాంకాంగ్ మార్కెట్లలో ఆరు ట్రిలియన్ డాలర్ల సంపదను మదుపర్లు విక్రయించి దేశానికి షాక్ ఇచ్చారు. ఈ తరుణంలో దేశంలోని ఆర్థిక నిపుణులు సలహా మేరకు అక్కడి మార్కెట్ రెగ్యులేటర్లు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాయి.
ఇందులో భాగంగా చైనా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. షార్ట్ సెల్లింగ్‌కు సంబంధించి ‘చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (సీఎస్‌ఆర్‌సీ)’ పరిమితులు విధించింది. ఈ నిబంధనలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ‘రెస్ట్రిక్టెడ్ స్టాక్స్’ లిస్ట్‌లో ఉన్న షేర్లను ఇతరులకు అప్పుగా ఇచ్చేలా గతంలో ఉన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు సీఎస్‌ఆర్‌సీ తెలిపింది. దీనిపై మరిన్ని షరతులను మార్చి మూడోవారంలో తెలియజేయనున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఒకేసారి మూడు ఉపగ్రహాలు ప్రయోగించిన దేశం..!
చైనా వృద్ధి రేటు చాలా ఏళ్లపాటు నెమ్మదిగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఆ దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్థిరాస్తి రంగం ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసింది. అక్కడి స్టాక్ మార్కెట్ మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా పటిష్ట పరుచుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment