AP CM YS Jagan In WEF Public Session Davos Second Day Tour - Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ - డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో వైఎస్‌ జగన్‌

Published Mon, May 23 2022 12:34 PM | Last Updated on Mon, May 23 2022 1:58 PM

CM YS Jagan In WEF Public Session Davos Second Day Tour - Sakshi

CM YS Jagan Davos Tour: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు (సోమవారం) ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అంశంపై  మాట్లాడారు. డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్‌ సెషన్‌లో పాల్గొన్న ఆయన ఏపీలో కోవిడ్‌ నియంత్రణకు తీసుకున్న చర్యలతో పాటు రాష్ట్రంలో వైద్య వ్యవస్థలు ఎలా బలోపేతం చేస్తున్నది వివరించారు. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం తీరు తెన్నులను  వెల్లడించారు.  

కోవిడ్‌ నియంత్రణ
ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్‌ నియంత్రణ కార్యాచరణ అమలు చేశాం. 44 ఇళ్లు ఒక యూనిట్‌గా ఇంటింటికి సర్వే చేపట్టాం. ఇందు కోసం ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ వంతున పని చేశారు. 42 వేల మంది ఆశావర్కర్లు ఇందులో పాలు పంచుకున్నారు. ఇంటింటికి వెళ్లి కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వారిని గుర్తించాం. ప్రత్యేకంగా ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. మెడిసిన్స్‌ అందించాం. రోగులు అవసరమైన పౌష్టిక ఆహారం అందిస్తూ పకడ్బందీ ప్రణాళిక అమలు చేశాం. అందువల్లే  కరోనా మరణాల రేటు ఏపీలో జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా దేశంలోనే అత్యల్పంగా  0.6 శాతంగా నమోదు అయ్యింది.


ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలో
ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఏవైనా రోగాలు వస్తే వాటికి సరైన సమయంలో వైద్యం అందివ్వడమనేది మరో కీలకమైన అంశం. ఈ రెండు అంశాలను సెంట్రిక్‌గా చేసుకుని ఏపీలో హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ని రెడీ చేశాం. రాష్ట్రంలో రెండు వేల జనాభా కల్గిన ఒక గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం.  వీటిపైన ప్రతీ 13 వేల జనాభా మండలం యూనిట్‌గా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాము. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. అంటే ప్రతీ పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఈ పీహెచ్‌సీలకు అనుబంధంగా 104 అంబులెన్సులు ఉంటాయి. పీహెచ్‌సీలో ఉన్న డాక్టర్లకు కొన్ని గ్రామాల బాధ్యతలను అప్పగించాం. రోజు విడిచి రోజు ఈ డాక్టర్లు అంబులెన్సుల ద్వారా గ్రామాలకు వెళ్తారు. అక్కడి ప్రజలతో మాట్లాడుతారు... వీరంతా ఆ గ్రామంలోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా మారుతారు. పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యంతోపాటు ప్రతీ ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ డాక్టర్లకు తెలుస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏదైనా సమస్యలు వచ్చినా మొగ్గ దశలోనే దానికి చికిత్స అందించే వీలు ఉంటుంది.

వైద్య వ్యవస్థ బలోపేతం
మండల స్థాయి దాటి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ హాస్పటిల్స్‌ చికిత్స అందిస్తాయి. ప్రతీ పార్లమెంటు యూనిట్‌గా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్‌ కాలేజీలు వస్తాయి. అక్కడ పీజీ స్టూడెంట్స్‌ ఉంటారు. వీళ్లంతా హెల్త్‌కేర్‌లో భాగమవుతారు. దీని ద్వారా హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ బలోపేతం అవుతుంది. 

మూడేళ్లలో
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. మా ప్రభుత్వం రావడానికి ముందు 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేశాం. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్‌గా మెడికల్‌ కాలేజీలు ఉండటం వల్ల అన్ని చోట్ల హెచ్చుతగ్గులు లేకుండా వైద్యవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇందు కోసం ఇప్పటికే రెండు బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ కేటాయించాం. మూడేళ్లలో ఫలితాలు అందుతాయి. ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్‌ నియంత్రణ కార్యాచరణ అమలు చేశామని సీఎం జగన్‌ తెలిపారు.

కమ్యూనిటీ హెల్త్‌ ఇన్సురెన్స్‌
కమ్యూనిటీ హెల్త్‌ ఇన్సురెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ అనే పథకం అమలు చేస్తోంది. ఇందులో వెయ్యికి పైగా అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. కానీ అంతకంటే మిన్నంగా ఏపీలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నాం. ఇందులో ఏకంగా 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందిస్తున్నాం. ఐదు లక్షల కంటే తక్కువ వార్షియ ఆదాయం కలిగిన 1.44 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా సేవలు పొందుతున్నారు. గత మూడేళ్లలో 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా ఉచితంగా వైద్య సాయం అందించామని సీఎం జగన్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement