న్యూఢిల్లీ: గత కేలండర్ ఏడాది(2021)లో దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు నీరసించినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా రూపొందించిన నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాది(2020)తో పోలిస్తే 17 శాతం క్షీణించి 4.033 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వెల్లడించింది. 2020లో ఇవి 4.833 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలియజేసింది. నివేదిక ప్రకారం ఆఫీసు ఆస్తులలో సంస్థాగత పెట్టుబడులు 2.199 బిలియన్ డాలర్ల నుంచి 1.248 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇదే విధంగా మిశ్రమ వినియోగ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు సైతం పెట్టుబడులు 1.616 బిలియన్ డాలర్ల నుంచి 0.182 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. ఇక రిటైల్ విభాగంలో 2 మిలియన్ డాలర్లు తగ్గి 77 మిలియన్ డాలర్లకు ఇవి పరిమితమయ్యాయి.
జోరు చూపాయ్
గతేడాది ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగంలో సంస్థాగత పెట్టుబడులు భారీగా ఎగసి 1.130 బిలియన్ డాలర్లను తాకాయి. ఇవి గత ఐదేళ్లలోనే అత్యధికంకాగా.. 2020లో ఇవి 0.195 బిలియన్ డాలర్లు మాత్రమే. హౌసింగ్ రంగంలోనూ పెట్టుబడులు 0.386 బిలియన్ డాలర్ల నుంచి 0.919 బిలియన్ డాలర్లకు పుంజుకున్నాయి. ఈ బాటలో ప్రత్యామ్నాయ ఆస్తుల విషయంలో 0.359 బిలియన్ డాలర్ల నుంచి 0.453 బిలియన్ డాలర్లకు బలపడ్డాయి. విద్యార్ధుల హౌసింగ్, సహచర జీవనం, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు ఈ విభాగంలోకి వస్తాయని కొలియర్స్ పేర్కొంది. ఈకామర్స్ రంగం, థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ నుంచి ఊపందుకున్న డిమాండ్ కారణంగా ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పెట్టుబడులు భారీగా పెరిగినట్లు తెలియజేసింది. కాగా.. హౌసింగ్ రంగంలో తాజా పెట్టుబడులకు పీఈ సంస్థలు ఆసక్తి చూపినట్లు తెలియజేసింది. అంతేకాకుండా బ్యాంకులు, ఇతర ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రస్తుత రుణాల పునర్వ్యవస్థీకరణ, రీఫైనాన్సింగ్ అవసరాలకు పెట్టుబడులు సమకూర్చినట్లు వివరించింది. ఈ రంగంలోని సంస్థాగత పెట్టుబడుల్లో విలాసవంత హౌసింగ్ 35 శాతం వాటాను ఆక్రమించగా.. మధ్యాదాయం, అందుబాటు గృహ విభాగం మిగిలిన పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేసింది.
ఇళ్ల అమ్మకాలు 71% అప్: అనరాక్
దేశీయంగా టాప్ 7 నగరాల్లో గతేడాది 2,36,530 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 71 శాతం అధికం. అయితే, కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే మాత్రం 10 శాతం మేర క్షీణత నమోదైంది. కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లో విక్రయాలు మూడు రెట్లు వృద్ధి చెంది 8,560 యూనిట్ల నుంచి 25,410 యూనిట్లకు పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అమ్మకాలు 72 శాతం పెరిగి 76,400 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్ (రాజధాని ప్రాంతం)లో విక్రయాలు 73 శాతం (40,050), పుణెలో 53 శాతం (35,980), బెంగళూరులో 33 శాతం (33,080), చెన్నైలో 86 శాతం (12,530) మేర ఇళ్ల విక్రయాలు పెరిగాయి. కోల్‌కతాలో 7,150 యూనిట్ల నుంచి 13,080 యూనిట్లకు చేరాయి. గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు, పేరుకుపోయిన డిమాండ్, సొంతిల్లు సమకూర్చుకోవాలన్న ఆకాంక్షలు పెరగడం, కొన్ని రాష్ట్రాల్లో స్టాంపు డ్యూటీలు తగ్గించడం, బిల్డర్లు డిస్కౌంటు ఆఫర్లు ఇవ్వడం తదితర అంశాలు గృహాల అమ్మకాలకు తోడ్పడ్డాయని అనరాక్ విశ్లేషించింది.
2022లోను సానుకూలం..
గతేడాది ధోరణులు చూస్తే, దేశీయంగా కరోనావైరస్ మహమ్మారి అదుపులోనే ఉన్న పక్షంలో ఈ ఏడాది (2022) కూడా ఇళ్ల అమ్మకాల వృద్ధి అత్యంత సంతృప్తికరంగానే ఉండవచ్చని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. 2022లోనే అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. విశ్వసనీయ డెవలపర్ల ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతుందని పురి వివరించారు.
చదవండి: బిల్డర్ ప్రొఫైల్ చూడకుండా ఇళ్లు, ఫ్లాట్స్ కొనొద్దు !
Comments
Please login to add a commentAdd a comment