హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రకటనలు, మార్కెటింగ్ కార్యకలాపాలకు కంపెనీలు 2021-22లో పెద్ద ఎత్తున వ్యయం చేయనున్నాయి. కోవిడ్-19 కారణంగా 2020లో భారత ప్రకటనల పరిశ్రమ విలువ పరంగా 21.5 శాతం తగ్గింది. ప్రస్తుత సంవత్సరంలో 23.2 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.80,123 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మారుతి సుజుకి, అమూల్, ఎల్‌జీ, పార్లే, పెప్సికో, వివో, మారికో, ఇమామి, వోల్టాస్, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్‌కు భారీగా ఖర్చు చేయనున్నాయి. కొన్ని సంస్థలు గతం కంటే 50 శాతం వరకు అధికంగా వెచ్చించనున్నట్టు సమాచారం. ఆదాయంతోపాటు మార్కెట్ వాటాను పెంచుకునే వేటలో కంపెనీలు ఖర్చుకు వెనుకాడడం లేదు.
డిమాండ్ నేపథ్యంలో..
కొన్ని నెలలుగా కస్టమర్లు వస్తువులు, ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తుండడం కంపెనీలను ఆకట్టుకుంటోంది. మహమ్మారి మూలంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన వ్యాపారం నుంచి రికవరీకి 2021-22లో చేసే వ్యయాలు దోహదం చేస్తాయని సంస్థలు భావిస్తున్నాయి. వేసవిలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల పానీయాలు, ఐసీ క్రీమ్స్ వంటి విభాగాలకు డిమాండ్ ఉంటుంది. ఈ విభాగాల్లో వ్యాపారం సాగిస్తున్న కంపెనీలు ఆ మేరకు ప్రకటనలు, మార్కెటింగ్‌పై వ్యయాలను పెంచనున్నాయి. గతేడాది డిజిటల్ ప్రకటనలకు పరిమితమైన ఈ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వేదికలనూ వినియోగించు కోనున్నాయి. ప్రధానంగా ప్రింట్ మీడియా కీలకం కానుందని కాంటినెంటల్ కాఫీ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పటా్నయక్ తెలిపారు. ఎఫ్‌ఎంసీజీ రంగం 15-20 శాతం అధికంగా వ్యయం చేయనుందని అన్నారు.
ఖర్చుల్లోనూ పోటీయే..
ప్రకటనలు, మార్కెటింగ్ కోసం చేసే వ్యయాల్లోనూ కంపెనీలు పోటీపడుతున్నట్టు ఉంది. 2021-22లో ఎల్‌జీ ఏకంగా రూ.650 కోట్లు వ్యయం చేయనుంది. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం అధికం. ఇప్పటి వరకు ఎల్‌జీ ఇండియా ఈ స్థాయిలో ఖర్చు చేయకపోవడం గమనార్హం. అంచనాలను మించి మార్కెట్ రికవరీ అయిందని, ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఎల్‌జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు. బ్లూ స్టార్ రూ.35 కోట్ల నుంచి రూ.64 కోట్లకు బడ్జెట్ పెంచింది. గతేడాది లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నుంచి కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయడం ప్రారంభించాయి. దాదాపు 2019-20 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వ్యయాలు చేశాయి.
ముందు వరుసలో ఎఫ్‌ఎంసీజీ..
భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) విభాగంలోని కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ విషయంలో ముందున్నాయి. ఆ తర్వాత ఈ-కామర్స్, ఆటోమొబైల్, టెలికం, రిటైల్, డ్యూరబుల్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రకటనలు ప్రధానంగా వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రియల్టీ రంగం ప్రధాన ఆకర్షణ అని బ్రాండింగ్ సేవల్లో ఉన్న జాన్‌రైజ్ క్రియేటివ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. గతంలో లేని విధంగా ఆరోగ్య బీమా, మ్యూచువల్ ఫండ్స్ ప్రకటనలూ వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఇక్కడి మార్కెట్లో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, గుంటూరు వంటి పెద్ద నగరాలు, ఖర్చులకు వెనుకాడని కస్టమర్లు ఉండడమూ కంపెనీలకు కలిసి వస్తోందని వివరించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment