ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరెక్షన్ పరిమితంగా ఉంటూ.., తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందంటున్నారు. బక్రిద్ సందర్భంగా బుధవారం సెలవు కావడంతో నాలుగురోజులే ట్రేడింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు ముగింపు గురువారం ఉంది. గతవారం(జూన్ 22న) మొదలైన విప్రో రూ.12,000 బైబ్యాక్ ఇష్యూ గురువారమే ముగియనుంది.
ఇదే వారంలో చిన్న, మధ్య తరహా కంపెనీలతో మొత్తం ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అంతర్జాతీయంగా రష్యాలో అంతర్యుద్ధ పరిణామాలు, ఈసీబీ ఫోరమ్ నిర్వహించే సమావేశంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. వీటితో పాటు రుతుపవనాల వార్తలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, రూపాయి విలువ కీలకం కానున్నాయి.
‘‘మార్కెట్ స్థిరీకరణలో భాగంగా అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు. దేశీయంగా బలమైన స్థూల ఆర్థిక డేటా నమోదు, కమోడిటీ ధరలు దిగిరావడం తదితర సానుకూలాంశాల ప్రభావంతో దిద్దుబాటు పెద్దగా ఉండకపోవచ్చు. దిద్దుబాటు కొనసాగితే నిఫ్టీకి దిగువున 18,600–18,650 శ్రేణిలో తక్షణ మద్దతు స్థాయి కలిగి ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 18,750 స్థాయిని చేధించాల్సి ఉంటుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్రితం వారం సెన్సెక్స్ 405 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
ప్రపంచ పరిణామాలు...
రష్యాలో తిరుగుబాటు పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పోర్చుగల్‌లోని సింట్రాలో కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ(2023)పై ఈసీబీ ఫోరం నిర్వహించే పాలసీ చర్చలో పాల్గొనున్నారు. అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 జీడీపీ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. అదే రోజున మే జపాన్ రిటైల్, వినిమయ విశ్వాస డేటా వెల్లడికానున్నాయి.
ఈ వారంలో 7 ఐపీఓలు..
ఈ వారంలో ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. ఇడియాఫోర్జ్, సియెంట్ డీఎల్‌ఎమ్, పీకేహెచ్ వెంచర్స్‌తో మరో నాలుగు చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.1600 కోట్లు సమీకరించనున్నాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం(నేడు) ప్రారంభమై జూన్ 29(గురువారం) ముగుయనుంది. ధరల శ్రేణిని రూ.632–672గా ఉంది. మొత్తం రూ.576 కోట్లు సమీకరించనుంది. సైయంట్ డీఎల్‌ఎం ఐపీఓ మంగవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం(జూన్ 30న) ముగుస్తుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలైన కన్వేయర్ బెల్ట్ తయారీ సంస్థ పెంటగాన్ రబ్బర్(జూన్ 26 – 30), సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ సంస్థ(జూన్ 30 – జూలై 5), త్రివిద్య టెక్, సినోఫిట్స్ టెక్నాలజీ ఐపీఓలు రెండూ జూన్ 30న మొదలై.., జూలై అయిదున ముగియనున్నాయి.
మూడు వారాల్లో రూ.30,600 కోట్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐటు) భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు వారు రూ. 36,600 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ఆర్థికవ్యవస్థ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, కార్పొరేట్ రంగం ఆదాయం పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ‘‘ఎఫ్‌ఐఐల పెట్టుడబడులు రానున్న రోజుల్లో నెమ్మదించవచ్చు. అమెరికా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం కంటే దిగువకు చేర్చేందుకు మరింత వడ్డీ పెంపు అవసరమని భావిస్తుంది. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వహించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment