కరోనా సెకండ్‌ వేవ్‌: ఆశ-నిరాశల ఎకానమీ | Covid-19 Second wave hit recovery but worst may be over | Sakshi
Sakshi News home page

Economy: కొంచెం కష్టం..కొంచెం ఇష్టం

Published Tue, Jul 6 2021 10:48 AM | Last Updated on Tue, Jul 6 2021 11:01 AM

 Covid-19 Second wave hit recovery but worst may be over - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మొదటివేవ్‌ నుంచి 2020-21 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికాలూ కొంత కోలుకున్నాయని ఊరట చెందుతున్న నేపథ్యంలోనే సెకండ్‌ వేవ్‌ దేశంపై విరుచుకుపడింది. కరోనా కట్టడికి దేశ వ్యాప్త కఠిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2020–21 తొలి జూన్‌ త్రైమాసికంలో ఎకానమీ 24.4 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. తదుపరి జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది. అయితే మూడు, నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 0.5 శాతం, 1.6 శాతంగా నమోదయ్యాయి.

ఇక మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణ రేటు అంచనాకన్నా తక్కువగా మైనస్‌ 7.3 శాతానికి పరిమితమైంది. అయితే  2021-22 మొదటి త్రైమాసికం ప్రారంభంలోనే ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు విసిరింది. సెకండ్‌ వేవ్‌ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలోనూ ఎకానమీ 12 శాతం క్షీణిస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ-యూబీఎస్‌ అంచనాకూడా వేసింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసిన మహమ్మారి కొత్త కేసులు స్థానికంగా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ల వల్ల జూన్‌లో కొంత అదుపులోనికి వచ్చాయి. తిరిగి ఎకానమీ రికవరీపై ఆశలు ప్రారంభమయ్యాయి. జూన్‌లో ఆర్థిక పరిస్థితులు చూస్తే, మొత్తంగా ఆశ-నిరాశల మధ్య ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది.

ఆ వివరాలు చూస్తే.. 
నోమురా ఇండియా బిజినెస్‌ రిజమ్షన్‌ ఇండెక్స్‌: జూలై 4వ తేదీతో ముగిసిన వారంలో 91.3కు పెరిగింది. అంతక్రితం వారం జూన్‌ 27వ తేదీతో ముగిసిన వారంలో ఈ ఇండెక్స్‌ 86.3 వద్ద ఉంది. నిజానికి అంతక్రితం ఆరు వారాల నుంచీ ఈ ఇండెక్స్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది. రవాణా, విద్యుత్‌ డిమాండ్, కార్మిక శక్తి భాగస్వామ్యం వంటివి సూచీ వెయిటేజ్‌లో ప్రధానమైనవి. ప్రస్తుతం సూచీ (91.3) మహమ్మారి ముందస్తు స్థాయికన్నా 8.7 శాతం తక్కువగా ఉంటే, సెకండ్‌వేవ్‌ ముందు స్థాయికన్నా 3.6 శాతం తక్కువగా ఉంది.  

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌: జూన్‌ 28వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే, 78.3 నుంచి 91.8కి ఎగసింది. వారంవారీ కూరగాయల సరఫరాలు, ప్రాంతాల వారీ రవాణా సంఘాల రెవెన్యూ వసూళ్లు పెరిగాయి. అయితే కార్మిక భాగస్వామ్యం రేటు ఇంకా తక్కువగానే ఉందని ఎస్‌బీఐ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య క్రాంతి ఘోష్‌ తెలిపారు.  

విద్యుత్‌ డిమాండ్‌:  సాయంత్రం కీలక రద్దీ సమయంలో విద్యుత్‌ డిమాండ్‌ విషయానికి వస్తే, 2021 మేలో 11.2 శాతం క్షీణత నమోదుచేసుకుంటే, జూన్‌లో 8.3 శాతం పురోగమించింది. ఎకానమీ తిరిగి క్రియాశీలం అవుతోందనడానికి ఇది సంకేతంగా కనబడుతోంది.  

సేవలు, తయారీ రంగాలు: అయితే సేవల రంగం మాత్రం ఇంకా తీవ్ర పేలవంగా ఉంది.  జూన్‌లో ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ మరింత క్షీణించి 41.2కు  పడిపోయింది. మేలో సూచీ 46.4 వద్ద ఉంది. కాగా సేవలు-తయారీ రంగాలు కలిపిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ మేలో 48.1 వద్ద ఉంటే, జూన్‌లో 43.1 దగ్గరకు పడింది. ఒక్క తయారీ రంగ కార్యకలాపాలను సూచించే ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా తయారీ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) కూడా జూన్‌లో క్షీణతలోకి జారి 48.1 పాయింట్లకు పడిపోయింది. మేలో ఈ సూచీ 50.80 వద్ద ఉంది.  

వస్తు రవాణా:  జూన్‌లో వస్తు రవాణా పెరిగిందని ఈ-వే బిల్లులు సూచిస్తున్నాయి. జూన్‌ 27తో అందిన గణాంకాలను చూస్తే, ఈ– వే బిల్లుల పరిమాణం 4.75 కోట్లు. అంతక్రితం ఇదే తేదీతో ముగిసిన నెల్లో ఈ మొత్తం రూ.4 కోట్లే. అయితే 2021 మార్చితో పోల్చితే మాత్రం ఇంకా ఈ పరిమాణం తక్కువగానే ఉంది. ప్రధాన రూట్లలో మేలో 6 నుంచి 8 శాతం పడిపోయిన ట్రక్‌ రెంటల్స్‌ తాజా సమీక్షా నెల్లో 13 నుంచి 15 శాతం పెరిగినట్లు ఇండియన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ గణాంకాలు తెలిపాయి. అయితే అధిక ట్రక్‌ రెంటల్స్‌ పెరుగుదల్లో డీజిల్‌ ధర పెరుగుదల పాత్రా ఉందన్న విశ్లేషణ ఉంది.  

ఎగుమతులు: జూన్‌లో ఎగుమతుల విలువ 32.46 బిలియన్‌ డాలర్లు. మేలో 32.27 బిలియన్‌ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతులు 38.55 బిలియన్‌ డాలర్ల నుంచి 41.86 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి.  

ఉపాధి:  ప్రభుత్వ ప్రధాన ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద డిమాండ్‌ ఏడాది స్థాయికి  ఎగసింది. సమీక్షా నెలల్లో పనుల్లో పాల్గొన్న వారి సంఖ్య 1.7 కోట్ల నుంచి 1.9 కోట్లకు పెరిగింది.  సీఎంఐఈ అంచనాల ప్రకారం, నిరుద్యోగం రేటు 2021 మేలో 11.9 శాతం ఉంటే, జూన్‌లో ఈ రేటు 9.1 శాతానికి తగ్గింది.  కాగా కార్మిక భాగస్వామ్యం రేటు జూన్‌లో సగటున 40 శాతంగా ఉంది. ఏప్రిల్, మేలకు ఇది దాదాపు సమానం. అయితే కోవిడ్‌ ముందస్తు కాలంలో ఈ సగటు 42.7 శాతంగా ఉండేది. 

స్టాక్‌ మార్కెట్‌:  ఫైనాన్షియల్‌ వెల్త్‌ విషయానికి వస్తే,  స్టాక్‌ మార్కెట్‌ బంపర్‌ ర్యాలీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ఇన్వెస్టర్లు రూ.25.46 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. బీఎస్‌ఈ చరిత్రలో  మే 24న మొదటిసారిగా లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల(రూ.218 లక్షల కోట్లు)కు చేరింది. అలాగే జూన్‌ 15న రూ.232 లక్షల కోట్లకు చేరుకుని మార్కెట్‌ క్యాప్‌ విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇదే 3 నెలల్లో సెన్సెక్స్‌ సూచీ 2,973 పాయింట్లు(6%) లాభపడంది. ఈ జూన్‌ 28వ తేదిన 53,127 వద్ద జీవితకాల గరిష్టాన్ని, జూన్‌ 25 తేదీన 52,925 వద్ద ఆల్‌టైం హై ముగింపు స్థాయిని లిఖించింది.  

ఫారెక్స్‌: విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు జీవితకాల గరిష్టాలకు చేరాయి. జూన్‌ 25తో ముగిసిన వారంలో 608.999 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు ఆబీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రూపాయిల్లో ఇది సుమారు రూ.45 లక్షల కోట్లకు పైనే.

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో రెండంకెల వృద్ధి
వేగంగా విక్రయమయ్యే ఉత్పత్తుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు లాక్‌డౌన్‌ల కాలంలోనూ మంచి వృద్ధిని చూపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ మొదటి త్రైమాసికంలో రెండంకెల స్థాయిలో అధిక విక్రయాలను నమోదు చేశాయి. గోద్రేజ్‌ కన్జ్యూమర్, మారికో సంస్థలు మొదటి త్రైమాసికం పనితీరుకు సంబంధించి గణాంకాలను స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేశాయి. ‘‘2021–22 క్యూ1లో మా ఉత్పత్తులకు డిమాండ్‌ స్థిరంగానే ఉంది. రెండంకెల స్థాయిలో విక్రయాలు నమోదైనట్టు అంచనా వేస్తున్నాము’’అని గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ తెలిపింది. మారికో సైతం దేశీయ వ్యాపారం మొదటి త్రైమాసికంలో 30 శాతం వృద్ధి చెందినట్టు ఇప్పటికే ప్రకటించింది. క్యూ1లో అధిక వృద్ధిని అంచనా వేస్తున్నామని టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ఎండీ, సీఈవో సునీల్‌ డిసౌజా సైతం ఇటీవలే ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు బలమైన విక్రయాలు నమోదు చేశాయని, అనంతరం కరోనా కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ.. తిరిగి జూన్‌లో విక్రయాలు జోరుగా నమోదైనట్టు ఎడెల్‌వీజ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆబ్‌నీష్‌రాయ్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement