కరోనా సెకండ్‌వేవ్‌తో దేశం అల్లకల్లోలమైనప్పటికీ... స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ మాత్రం షం‘షేర్’ అంటూ సత్తా చాటాయి. బుల్ రంకెలేయడంతో... సెన్సెక్స్, నిఫ్టీ కొత్త చరిత్రను లిఖించాయి. 62,245 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 18,604 పాయింట్ల వద్ద నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టాలను తాకాయి. మరోపక్క, ఎకానమీ కూడా వేగంగా కోలుకొని మళ్లీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి బాటలోకి పయనించింది. స్టార్టప్‌ల ‘యూనికార్న్’ పరుగు... దేశీ కుబేరుల సంపద జోరు... జీఎస్‌టీ వసూళ్ల కొత్త రికార్డులు.. ఐపీఓల పరంపర.. వంటి కీలక పరిణామాలకు 2021 వేదికైంది. భారత కార్పొరేట్ రంగంలో ఈ ఏడాది మిగిల్చిన జ్ఞపకాలను ఒకసారి గుర్తుచేసే ’2021 బిజినెస్ రివైండ్’ ఇది...
జనవరి
టిక్‌టాక్‌పై గత ఏడాది జూన్‌లో విధించిన నిషేధం నేపథ్యంలో ఈ వీడియో వ్యాపారం నిర్వహిస్తున్న బైట్‌డ్యాన్స్ భారత్‌లో కార్యకలాపాల మూతపడింది. ఇందులో భాగంగా 2000 మంది ఉద్యోగులను తొలగించింది.2020 జూన్‌లో ప్రభుత్వం దాదాపు 59 చైనా యాప్‌లపై నిషేధం విధించింది.
ఫిబ్రవరి
ఆర్థికమంత్రి సీతారామన్ మోదీ 2.0 సర్కారులో మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకంసహా పలు ఉద్దీపన పథకాలను ప్రకటించారు. 6.8% (రూ.15,06 లక్షల కోట్లు) వద్ద ద్రవ్యలోటు కట్టడి, రూ.12.05 లక్షల కోట్ల సమీకరణ, రూ.1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ వంటివి కీలకాంశాలు.
మార్చి
టాటా గ్రూప్–సైరస్ మిస్త్రీల మధ్య నాలుగేళ్ల న్యాయ పోరాటంలో టాటాలే విజయం సాధించారు. 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్‌నకు ఎగ్జిక్యూటివ్
చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఏప్రిల్
సేవల విస్తరణ, పటిష్టతలో భాగం గా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను బైజూస్ ట్యుటోరియల్ చైన్ కొనుగోలు చేసింది. డీల్ విలువ దాదాపు బిలియన్ డాలర్లు. నగదు, స్టాక్ డీల్‌లో ఈ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఎడ్–టెక్ రంగంలో ప్రపంచంలోని భారీ ఒప్పందాల్లో ఇది ఒకటి.
మే
బ్యాంకింగ్‌లో వ్యక్తిగత హామీదారులపైనా దివాలా చర్యలు తీసుకోవచ్చన్న కేంద్రం నోటిఫికేషన్‌ను (2019) సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో అడాగ్ గ్రూప్ అనిల్ అంబానీ, దివాన్ హౌసింగ్‌కు చెందిన కపిల్ వాద్వాన్ తదితరులపై దివాలా కోడ్ కింద చర్యలకు మార్గం సుగమం అయ్యింది.
జూన్
గత శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వశీలి భారత పారిశ్రామిక పితామహుడు జమ్‌షెడ్‌జీ టాటా అని హురూన్ నివేదిక పేర్కొంది. ఆయన వితరణ 102 బి.డాలర్లని (ఇప్పటి మారకపు విలువలో దాదాపు రూ.7.65 లక్షల కోట్లు) తెలిపింది. తర్వాత స్థానాల్లో బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ ఉన్నారు.
జూలై
ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు బీమా రక్షణను రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని ఇకపై మారటోరియం విధించిన బ్యాంకులకూ వర్తించేలా డీఐసీజీసీ, 1961 చట్ట సవరణకు ఆమోదముద్ర వేసింది. యస్ బ్యాంక్, పీఎంసీ వంటి పలు బ్యాంకుల సంక్షోభంతో కస్టమర్ల కష్టాల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.
సెప్టెంబర్
n జనరల్ మోటార్స్, హర్లే డేవిడ్‌సన్ వంటి దిగ్గజాల బాటలోనే యూఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్ భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది.
n ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెల్కోలకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించింది. బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం, ఏజీఆర్ నిర్వచనాన్ని సవరించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
అక్టోబర్
► ఫోర్బ్స్ కుబేరుల (భారత్) లిస్టులో 14వ ఏడాదీ ముకేశ్ అంబానీ టాప్‌లో, రెండో స్థానం లో అదానీ నిలిచారు. టాప్ 100లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మురళి దివి (19) సతీష్‌రెడ్డి(69), పీసీ రెడ్డి(79), ప్రతాప్ రెడ్డి(88), రామ్ ప్రసాద్ రెడ్డి(90) ఉన్నారు.
► ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు 2024 డిసెంబర్ వరకూ కేంద్రం పొడిగించింది.
నవంబర్
► ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.
► ఎస్‌బీఐ మాజీ ఛైర్మ న్ ప్రతిప్ చౌదరి అరెస్టయ్యారు. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వైఫల్యం వ్యవహారానికి సంబంధించి దాదాపు 200 కోట్ల హోటల్ ఆస్తి జప్తులో అవకతవకలు జరిగాయన్నది ఆరోపణ.
డిసెంబర్
► ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇండియన్ అమెరికన్ గీతా గోపీనాథ్ (49) పదోన్నతి పొందుతున్నారు. బహుళజాతి బ్యాంకింగ్ సేవల సంస్థ నెంబర్ 2 స్థానంలో ఒక మహిళ నియమితులుకావడం ఇదే తొలిసారి.
► సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ విలీనం దిశగా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
బుల్ చల్..:కరోనా దెబ్బ పడినా... భారత స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది దుమ్ముదులిపేశాయి. ఎన్ని ఆటుపోట్లకు లోనైనా అక్టోబర్ 18న సెన్సెక్స్ 61,963 వద్ద, నిఫ్టీ 18,543 వద్ద ఆల్‌టైం హై రికార్డులను సృష్టించాయి. ఈ ఏడాది మొత్తం సెన్సెక్స్ 21 శాతం (10,043 పాయింట్లు), నిఫ్టీ 23 శాతం (3221 పాయింట్లు) చొప్పున ఎగబాకాయి. ఇన్వెస్టర్లూ రికార్డు స్థాయిలో రూ.72 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు.
Comments
Please login to add a commentAdd a comment