కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో సోషల్ మీడియా పాత్ర మరింత విస్తరించింది. యూట్యూబ్‌లో ఎంతో మంది పెట్టుబడి సలహాదారుల పాత్రను పోషిస్తున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి పేజీలకు లెక్కేలేదు. ఎక్కడైనా మంచి చెడు కలసి సహవాసం చేస్తాయన్నట్టే.. ఇక్కడ కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇలాంటి సోషల్ మీడియా చానళ్లలో లభించే కంటెంట్ ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, కచ్చితమైనదేనా..? ఆ విచక్షణ పెట్టుబడిదారులదే అవుతుంది. రిస్క్ కూడా పెట్టుబడిదారులదే.
చానళ్లలో బోలెడు కంటెంట్‌ను ఊదరగొట్టేవారిది కాదని గుర్తుంచుకోవాలి. సంప్రదాయ టీవీ మాధ్యమంతో పోలిస్తే సోషల్ మీడియా చానళ్లు కొన్ని వినూత్నంగా కంటెంట్ అందించొచ్చు. మరీ ముఖ్యంగా స్థానిక భాషల్లో ఇవి కంటెంట్‌ను అందించడం సానుకూలమే. దీన్ని అధ్యయనానికి ఇన్‌పుట్‌గానే చూడాలి. దాన్నే ఆధారంగా చేసుకుని పెట్టుబడి పెడతానంటే..? రిస్క్‌ను ఆహ్వానించినట్టు అవుతుంది. ఇలాంటి సోషల్ మీడియా సలహాలు, సూచనలు, కంటెంట్ విషయంలో పెట్టుబడిదారులు అనుసరించాల్సిన మార్గంపై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశం.
మార్కెటింగ్ చేస్తున్నారా/విజ్ఞానం పంచుతున్నారా..?
అనుమతించని సాధనాలు..: గడిచిన ఏడాది కాలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. క్రిప్టో కరెన్సీలు స్థూల ఆర్థిక రంగానికి ముప్పు అంటూ, ఏ ఒక్కరో నియంత్రించలేని అలాంటి సాధనాలను దేశంలో అనుమతించొద్దని ఆర్‌బీఐ కేంద్రానికి సూచించింది. క్రిప్టోల్లో పెట్టుబడులతో పూర్తిగా నష్టపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దంటూ ఇన్వెస్టర్లను ఎన్నో సార్లు హెచ్చరించింది కూడా. కానీ, ఈ సూచలను తలకెక్కించుకున్న ఇన్వెస్టర్లు ఎంత మంది..? పైగా పేరొందిన నిపుణులు, ఆర్థిక సాధనాలపై అవగాహన కలిగిన వారు తమ యూట్యూబ్ చానళ్లలో క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా..? ఏ ప్లాట్‌ఫామ్‌లు అనుకూలం? క్రిప్టోలు, ఎన్‌ఎఫ్‌టీల్లో వేటికి భవిష్యత్తు ఉంటుంది? ఇలాంటి వీడియోలు ఎన్నింటినో వీక్షకులకు వదిలారు. చట్టబద్ధం కాని సాధనాల్లో పెట్టుబడులకు మార్గాలను చెప్పడం దేనికి సంకేతం..?. కాయిన్ డీసీఎక్స్, వాజిర్‌ఎక్స్ తదితర క్రిప్టో ఎక్సే్ఛంజ్‌ల ద్వారా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో సూచిస్తూ వీడియోలు పెట్టారు.
కొందరు ప్రముఖ క్రిప్టోలైన బిట్‌కాయిన్, ఎథీరియం, పాలీగాన్ (మాటిక్) వంటి వాటికే వీడియోలను పరిమితం చేశారు. ఇలాంటి వారి సూచనలను నమ్ముకుని గత ఏడాది కాలంలో క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏంటి..? నిండా నష్టపోయే ఉంటారు. ఏడాది కాలంలో బిట్‌కాయిన్ 60 శాతానికి పైగా పతనం అయింది. 2021 నవంబర్‌లో 67,000 డాలర్లకు పైగా వెళ్లిన బిట్‌కాయిన్ ఇప్పుడు 24,000 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఎథీరియం 60 శాతం, మ్యాటిక్ 80 శాతానికి పైనే వాటి విలువను కోల్పోయాయి. క్రిప్టోల్లో పెట్టుబడులను నిరుత్సాహ పరిచేందుకు, నల్లధనాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు లాభం నుంచి ఎక్సే్ఛంజ్‌లే 1 శాతం టీడీఎస్ కింద మినహాయించాల్సి ఉంటుంది.
అనుమతి లేని వేదికలు: నియంత్రణలేని, సెబీ లైసెన్స్ లేని ఆర్థిక సలహాదారులే ఎక్కువ. సోషల్ మీడియా వేదికల్లో 99 శాతం ఇలా అనుమతి లేని వారు నిర్వహించేవే. కాకపోతే, ఒక్క డిస్‌క్లెయిమర్ ఇచ్చి తమకు సంబంధం లేదన్నట్టు వీరు వ్యవహరిస్తుంటారు. డిజిటల్ గోల్డ్ తదితర సాధనాలను కూడా ప్రోత్సహించడాన్ని గమనించొచ్చు. ఇవి స్పెక్యులేటివ్ ట్రేడ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. బ్రైట్‌కామ్ స్టాక్ ఇందుకు ఒక ఉదాహరణ. దీని పూర్వపు పేరు లైకోస్ ఇంటర్నెట్. అంతే కాదు.. వైబ్రంట్ డిజిటల్, లాంకో గ్లోబల్ కూడా దీని పూర్వపు నామాలే. ఇలా అవతారాలు మార్చుకుంటూ వచ్చిన ఈ స్టాక్ గతేడాది సోషల్ మీడియా ఫేవరెట్‌గా మారిపోయింది. 2021 మేలో రూ.10 దగ్గరున్న స్టాక్ ధర అదే ఏడాది డిసెంబర్ నాటికి రూ.123కు పెరిగిపోయింది. యాడ్‌టెక్నాలజీ కంపెనీ అయిన బ్రైట్‌కామ్ సూపర్ మల్టీబ్యాగర్ అంటూ ఎన్నో సోషల్ మీడియా వేదికలు తెగ ప్రచారం కల్పించాయి.
కానీ, ఇక్కడ స్పష్టమైన సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఒక కంపెనీ అన్ని సార్లు పేర్లు ఎందుకు మార్చుకుంది? సీఎఫ్‌వో రాజీనామా వెనుక కారణం ఏంటి? బోనస్ షేర్లు క్రెడిట్ చేయడంతో జాప్యం ఎందుకు? 2019–20లో ఆస్తుల విలువ తరిగిపోవడంపై సెబీ ఫోరెన్సిక్‌కు ఆదేశించడం..? ఇలాంటి సమాధానాల్లేని సందేహాలతో ఈ స్టాక్ ఇప్పుడు అమ్మకాల ఒత్తిడి చూస్తోంది. గరిష్టం నుంచి సగానికి పైగా పతనం అయింది. ప్రమోటర్ల వాటా 18 శాతానికి దిగొచ్చింది. ఇవన్నీ కలసి ఇప్పుడు ఈ స్టాక్ రిటైల్ ఇన్వెస్టర్లకు బోర్ కొట్టేసింది. ఇది కేవలం ఒకే ఉదాహరణ. మైక్రోక్యాప్ విభాగం నుంచి ఎన్నో స్టాక్స్ విషయంలో ఇలాంటి ప్రచారమే నడుస్తుంటుంది. ఒక సోషల్ మీడియా వేదికల ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వ్యవహారాల పట్ల, చానళ్ల పట్ల ఇన్వెస్టర్లు అవగాహన కలిగి, వివేకంగా వ్యవహరించకపోతే వారి కష్టార్జితమే కరిగిపోతుంది.
ఎఫ్‌అండ్‌వో ఊరింపు: కరోనా లాక్‌డౌన్‌ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఏర్పాటైంది. ఖాళీ సమయంలో ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి అధికమైంది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఎఫ్‌అండ్‌వో (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) మార్కెట్లో పెరిగిపోయింది. సెబీ దీన్ని గమనించి మార్జిన్ల విషయంలో నిబంధనలను కఠినం చేసింది. కానీ, 2020 మార్చి పతనం తర్వాత నుంచి ఈక్విటీ మార్కెట్లు ఏకరీతిన పెరిగిపోవడం ఇన్వెస్టర్లకు తెగ ఉత్సాహాన్నిచ్చింది. దీన్ని అనుకూలంగా మలుచుకుని ఎన్నో ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ చానళ్లు ఎఫ్‌అండ్‌వో ట్రేడ్స్ సిఫారసులపై ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి.
కొందరు 99.9 శాతం కచ్చి తత్వం రేటుతో కాల్స్ ఇస్తామంటూ పెద్ద మొత్తంలో సబ్‌స్క్రిప్షన్స్ కూడా రాబట్టారు. మీ పెట్టుబడిని రోజులో 12 శాతం వృద్ధి చేస్తామని ఆశ పెట్టిన ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇలాంటి ఊరించే ప్రకటనలతో తమ చందాదారుల సంఖ్యను పెంచుకునేవి కొన్ని అయితే, చందా వసూలు చేసుకునేవి కొన్ని. రెండు విధాల వారికి లాభమే. చందాదారులు పెరిగే కొద్దీ ఆయా చానళ్లకు ప్రకటనల ఆదాయం వస్తుంది. ఇంక మార్కెట్లో రాబడుల విజయ సూత్రాలు చెబుతామంటూ వెబినార్లు, వర్క్‌షాపులు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.30,000 వరకు వసూలు చేశారు. బుల్ మార్కెట్లో ఇలాంటి ధోరణులే ఎక్కువగా చెలామణి అవుతుంటాయి. వీరిని నమ్ముకుని ఎఫ్‌అండ్‌వోలో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయిన వారే ఎక్కువ.
నియంత్రణ పాత్ర
సెబీ ‘ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ రెగ్యులేషన్స్ 2013’ పేరుతో కఠిన నిబంధనలను ఎప్పుడో తీసుకొచ్చింది. ఆర్థిక సలహాదారుల (ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్/రిసెర్చ్ అనలిస్ట్) పాత్ర పోషించాలంటే కావాల్సిన అర్హతలు, నెట్‌వర్త్, వారికి ఉండే బాధ్యతలు, రిజిస్ట్రేషన్ నిబంధనలను స్పష్టంగా నిర్వచించింది. ప్రయోజన వివాదాలకు చోటు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ఏ రూపంలో అయినా కమీషన్, ప్రోత్సాహకాలు తీసుకోకుండా నిషేధించింది. అయితే, సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న వేదికల్లో 99 శాతం ఈ నిబంధనలను పాటించడం లేదు. కొందరు తమ వీడియోలు, పోస్టుల్లో డిస్‌క్లెయిమర్‌కు చోటిస్తున్నారు.
దీన్ని ఎటువంటి రికమండేషన్‌గా భావించొద్దని, కేవలం సమాచారమేనని చెబుతున్నారు. ‘దీని ఆధారంగా మీరు స్వయంగా అధ్యయనం చేసిన తర్వాతే పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు. వాటిల్లో ఉండే రిస్క్‌లు కూడా తెలియజేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇలా డిస్‌క్లెయిమర్ తప్పనిసరి. అడ్వర్టైజ్‌మెంట్ లేదా పెయిడ్ ప్రమోషన్, స్పాన్సర్డ్, కొలాబరేషన్, పార్ట్‌నర్‌షిప్ ఇలా ఏదైనా చెప్పాల్సిందే. అందుకని మీరు అనుసరిస్తున్నది.. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ లేదా అనలిస్ట్ అవునా? కాదా అన్నది ముందు తెలుసుకోవాలి. సెబీ అనుమతి లేని వారి సూచనలను అనుసరిస్తే అది పూర్తిగా మీ అభీష్టమే అవుతుంది.
వేటిని అనుసరించాలి..?
సోషల్ మీడియాలో మనం చూసే కంటెంట్ ఎంత మాత్రం నిజమైనది? పరిశీలిస్తే, విశ్లేషణ కోణం నుంచి చూస్తే తెలుస్తుంది. కొన్ని వేదికలు మంచి కంటెంట్‌ను అందిస్తున్నాయి. వాటి సాయంతో ఎంతో నేర్చుకునే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక సాధనాలు, ఈక్విటీలపై పట్టు పెంచుకునేందుకు మంచి వేదికలను అనుసరించడం ప్రయోజనమే. ఫండ్ మేనేజర్లు, సీఈవోలతో ఇంటర్వ్యూలను అందిస్తున్న వేదికలు కూడా ఉన్నాయి. సెబీ అనుమతి లేకపోయినా కానీ.. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా ఉత్పత్తులకు సంబంధించి చక్కటి సమాచారం అందిస్తున్నవీ ఉన్నాయి. కాకపోతే పెయిడ్, స్పాన్సర్డ్ కంటెంట్‌ను ఫిల్టర్ చేసుకోగలిగితే చాలు.
అది అధ్యయనం, పరిశీలన మీద వస్తుంది. పేరున్న సోషల్ మీడియా వేదికలకు నకళ్లు ఎన్నో తయారయ్యాయి. ప్రాచుర్యం పొందిన ఆయా వ్యక్తులు, చానళ్ల పేరుతో నకిలీలు తెరిచి మోసం చేయడమే వారి లక్ష్యం. ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి ప్రభావానికి లోను కానంత వరకు సోషల్ మీడియా వేదికలు అధ్యయనానికి అద్భుతమైన వేదికలే. వాటిల్లోని సమాచారాన్ని చూసి వెంటనే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం చేయరాదు. కొన్ని సందర్భాల్లో సానుకూల ఫలితాలు రావచ్చు. కానీ, బెడిసికొట్టే సందర్భాలు కూడా ఉంటాయి. వీటిని రాబడుల టిప్స్ వేదికలుగా చూడొద్దు. అధ్యయన, అవగాహన మార్గాలుగానే చూడాలి. కచ్చితంగా స్వీయ అధ్యయనం తోడవ్వాలి. అంత అవగాహన లేకపోతే ఫీజు చెల్లించి నేరుగా నిపుణులను సంప్రదించాలి. ఇవేవీ అనుసరించలేకపోతే..
కనీసం రూ.1,000–2,000 పెట్టుబడితో ముందుగా ఒకటి రెండేళ్లపాటు పెట్టుబడుల్లోని సానుకూల, ప్రతికూలతలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. దీనివల్ల పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు.
పెయిడ్ పోస్టుల మాయలో పడొద్దు...
లైసెన్స్ కలిగిన ఆర్థిక సలహాలు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ సేవలకు ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉచితంగా వచ్చేవి కావు. కానీ, ఉచిత సమాచారంపై ఆధారపడే ఇన్వెస్టర్ల ధోరణి వారిని నష్టాల వైపు నడిపిస్తోందని చెప్పుకోవాలి. ఆర్థిక నిపుణుల్లో ఎంత మంది తమ విలువైన సమయాన్ని వెచ్చించి విలువైన కంటెంట్‌ను రోజువారీగా, వారం వారీ ఇవ్వగలరు? ఏదో ప్యాషన్‌గా పనిచేసుకునే వారు (వందల్లో కూడా ఉండరు) తప్పించి విలువైన కంటెంట్‌ను ఉచితంగా అందించే వారు పెద్దగా ఉండరు. ‘ఒక ఉత్పత్తి కోసం మీరు చెల్లించకపోతే.. మీరే ఉత్పత్తిగా మారతారు’ అన్న ప్రముఖ కొటేషన్ గుర్తు చేసుకోవాలి.
సీజనల్ ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు సోషల్ మీడియాలో కొంత సమయం వెచ్చిస్తుంటారు. వారికున్న పరిజ్ఞానం, అనుభవాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతోనే కొంత సమయం కేటాయిస్తుంటారు. కానీ, దీన్నే వ్యాపకంగా, ఆదాయ మార్గంగా పెట్టుకుని అర్హతలేని వారు నిర్వహించే వేదికలే ఎక్కువ. ఒక పద్ధతి ప్రకారం వీరు చానళ్లను ఏర్పాటు చేసి, కంటెంట్‌తో మిలియన్ల మందిని ఆకర్షించే మార్గంలో వెళుతుంటారు. ఆ కంటెంట్ రూపంలో ఆదాయాన్ని పొందడమే వారు ఎంచుకున్న మార్గం. కొన్ని ప్రముఖ సోషల్ మీడియా చానళ్ల నిర్వాహకులకు ఇలా భారీ ఆదాయమే వస్తోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఆర్థిక సంస్థల ప్రకటలను వారు అనుమతిస్తుంటారు.
అఫిలియేట్ మార్కెటింగ్ భాగస్వామ్యాలు కుదుర్చుకుంటూ ఉంటారు. తమ కంటెంట్‌లో ఫలానా బ్రాండ్ పేరుకు చోటు ఇచ్చినందుకు కొంత వసూలు చేస్తుంటారు. ఆయా కంపెనీల ఉత్పత్తులను అనుసంధానించే వెబ్ లింక్‌ను పోస్ట్ చేస్తుంటారు. ఈ లింక్‌లను ఎంత మంది క్లిక్ చేసి విజిట్ చేస్తే వారికి అంత ఆదాయం కమీషన్ రూపంలో సమకూరుతుంది. ఇదంతా స్వేచ్ఛగా జరిగే వ్యవహారమే. ఇందులో గుట్టేమీ లేదు. కానీ, వారు అందిస్తున్న కంటెంట్‌లో ప్రచారం కోసమా..? లేక అవగాహన కోసం పెడుతున్న కంటెంటా? అన్న నిజాన్ని ఎక్కువ మంది తెలుసుకోలేరు. పెయిడ్ ప్రచారం అని చెప్పేవారు బహుశా అతి కొద్ది మందే ఉన్నారు. కొందరు ఒక కంపెనీ లేదా బ్రాండ్‌కు ప్రచారం కల్పిస్తూ తమ యూట్యూబ్ చానల్‌లో వీడియో పోస్ట్ చేయడానికి లేదా ఫేస్‌బుక్ పోస్ట్ లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం భారీ ఫీజును వసూలు చేస్తుంటారు. సాధారణంగా ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనే దాన్ని బట్టి వసూలు చేసే మొత్తం ఆధారపడి ఉంటుంది. మిలియన్ల సబ్‌స్క్రయిబర్లు/ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ చానల్ లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఒక్కో పోస్ట్‌కు రూ.4–15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్రాయోజిత ట్వీట్లకు లక్షలు తీసుకునే వారున్నారు. ఒక కంపెనీ రైట్స్ ఇష్యూ సబ్
స్క్రయిబ్ చేసుకోవాలంటూ.. ఒక మైక్రోక్యాప్ స్టాక్‌ను మల్టీబ్యాగర్‌గా ఒకటికి మించి ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ చానళ్లు ఊదరగొడుతున్నాయంటే..? అవి పెయిడ్ పోస్ట్‌లుగా సందేహించాల్సిందే. ఆయా కంపెనీలు లేదా స్టాక్ ఆపరేటర్లు వాటి వెనుక ఉండొచ్చు. ‘పంప్ అండ్ డంప్’ ఆపరేటర్లకు ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్ వేదికలుగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ప్రచారం కల్పించి, రిటైల్ ఇన్వెస్టర్లతో కొనిపించేలా చేయడమే వారి వ్యూహం. చౌక ధరకు పోగు చేసిన ఆయా స్టాక్స్‌ను అనైతిక, అసత్య ప్రచారంతో తెలియని, ఆశతో కూడిన ఇన్వెస్టర్లకు అండగట్టి వారు లాభాలతో బయటకు వెళ్లిపోతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment