న్యూఢిల్లీ: స్టీల్, సిమెంట్ ధరలు దిగొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను రియల్ ఎస్టేట్ పరిశ్రమ జాతీయ సంఘాలైన క్రెడాయ్, నరెడ్కో కొనియాడాయి. తయారీదారులు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశాయి.
స్టీల్, సిమెంట్ ధరలు గడచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోవడం పట్ల ఈ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వీటి కారణంగా నిర్మాణ వ్యయాలు పెరిగిపోయాయని, వినియోగదారులపై భారం పడుతోందంటూ ప్రభుత్వం దృష్టికి ఈ సంఘాలు పలు పర్యాయాలు తీసుకెళ్లాయి.
ఈ నేపథ్యంలో స్టీల్ తయారీకి ముడి పదార్థాలైన కోకింగ్ కోల్, ఫెర్రో నికెల్ తదితర వాటిపై కస్టమర్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ గత శనివారం నిర్ణయాన్ని ప్రకటించింది. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయని, అంతిమంగా ఉత్పత్తుల ధరలు దిగొచ్చేందుకు సాయపడతాయని క్రెడాయ్, నరెడ్కో అంచనా వేస్తున్నాయి. ఐరన్‌ఓర్ ఎగుమతులపై సుంకాన్ని 50 శాతం వరకు, స్టీల్ ఇంటర్‌మీడియరీలపైనా 15 శాతం కేంద్రం పెంచింది.
భాగస్వాములు అందరికీ ప్రయోజనం
‘‘తయారీ వ్యయాల పెరుగుదలపై ఆర్థిక మంత్రి, ప్రభుత్వ జోక్యాన్ని మేము కోరుతూనే ఉన్నాం. పెరిగిపోయిన వ్యయాలతో రియల్ ఎస్టేట్ రంగంలో 18 నెలల్లో వృద్ధిపై ప్రభావం పడింది. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించడం భాగస్వాములు అందరికీ ఉపశమనం ఇస్తుంది’’అని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ పటోడియా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి అదనంగా ముడి ఇనుము, స్టీల్ ఇంటర్‌మీడియరీల దిగుమతులపైనా సుంకాలు తగ్గించడం దేశీయంగా స్టీల్ ఉత్పత్తుల ధరలు చల్లారడానికి సాయపడతాయన్నారు.
చదవండి👉 సామాన్యులకు మరో శుభవార్త! నూనెలతో పాటు వీటి ధరలు తగ్గనున్నాయ్!
Comments
Please login to add a commentAdd a comment