సాక్షి, ముంబై: గ్లోబల్‌గా చమురు ధరలు పడిపోవడంతో దేశీయమార్కెట్లో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ రేటు వడ్డీ రేటు భారీ పెంపు, గ్లోబల్‌గా ఇంధన డిమాండ్ తగ్గిపోవచ్చన్న భయాలతో శుక్రవారం ముడి చమురు నాలుగు వారాల కనిష్ట స్థాయికి 7 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి కనొసాగుతోంది. బ్యారెల్‌కు 125 డాలర్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 11 డాలర్లు తక్కువ. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నెలకొంది.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం 5 శాతానికి పైగా క్షీణించాయి. ముదురుతున్న ప్రపంచ మాంద్యం భయాలతో గతకొన్ని సెషన్లలో దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఆయిల్ ఇండియా ఏకంగా 12శాతం, ఓఎన్‌జీసీ 7 శాతం కుప్పకూలాయి. మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ దాదాపు 19 శాతం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 18 శాతంపైగా క్షీణించింది. ఇంకా గోవా కార్బన్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ 6 - 8 శాతం వరకు తగ్గాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు 77.98 వద్ద బలంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మునుపటి సెషన్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పురోగమించి 78.05 వద్ద స్థిరపడింది. అయితే, విదేశీ నిధుల తరలింపు, దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో ఊగిసలాట ధోరణి, డాలరు బలం కారణంగా లాభాలు పరిమితమవుతున్నట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు.
మరోవైపు ఆరు కరెన్సీల బాస్కెట్‌లో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయి 104.38కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.26 శాతం పడిపోయి 112.83డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర విక్రయదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలును కోల్పోయాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment