క్రూడ్‌ మోత.. పెట్రో వాత.. | Crude Oil Prices Rise amid Russia-Ukraine Conflict | Sakshi
Sakshi News home page

క్రూడ్‌ మోత.. పెట్రో వాత..

Published Thu, Mar 3 2022 12:38 AM | Last Updated on Thu, Mar 3 2022 12:38 AM

Crude Oil Prices Rise amid Russia-Ukraine Conflict - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్‌ రేట్లకు రెక్కలు రానున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక వచ్చే వారం నుంచి మళ్లీ రోజువారీ పెట్రో వాత మొదలు కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రేట్ల పెంపు రూ. 6–10 శ్రేణిలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి.
 
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో ఉద్రిక్తతల వల్ల కావచ్చు లేదా పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షల వల్ల కావచ్చు రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌ సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని అంతర్జాతీయంగా మార్కెట్లో ఆందోళన నెలకొంది. దీంతో క్రూడాయిల్‌ రేటు బ్యారెల్‌కు ఏకంగా 110 డాలర్ల పైకి ఎగిసింది. 2014 తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి ఎగియడం ఇదే ప్రథమం. ఇక భారత్‌ కొనుగోలు చేసే రకం క్రూడాయిల్‌ రేటు, ఎన్నికల హడావిడి ప్రారంభం కావడానికి ముందు .. అంటే.. గతేడాది నవంబర్‌లో పెట్రోల్, డీజిల్‌ రేట్లను రోజువారీ సవరించడం నిలిపివేసే నాటికి, సగటున 81.5 డాలర్ల స్థాయిలో ఉండేది. తాజాగా చమురు శాఖ గణాంకాల ప్రకారం ఇండియన్‌ బాస్కెట్‌ క్రూడాయిల్‌ ధర మార్చి 1న బ్యారెల్‌కు 102 డాలర్ల పైకి చేరింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లకు రెక్కలు రానున్నాయని భావిస్తున్నారు.  

క్రూడాయిల్‌ 1 డాలర్‌ పెరిగితే..
సాధారణంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 1 డాలర్‌ మేర పెరిగితే .. లీటరు ఇంధనం రేటు 48–52 పైసల చొప్పున పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్‌ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)లకు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు సాధారణంగా లభించే రూ. 2.5 మార్జిన్‌ కాకుండా రూ. 5.7 మేర నష్టం వస్తోంది.

దీంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల మార్కెటింగ్‌ మార్జిన్లు తిరిగి మామూలు స్థాయికి రావాలంటే ఇంధనాల రిటైల్‌ ధరలను లీటరుకు రూ. 9 (10 శాతం) మేర పెంచాల్సి రావచ్చని బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్‌ పేర్కొంది. ‘ఈ పరిస్థితిని నెగ్గుకు రావాలంటే ఎక్సయిజ్‌ డ్యూటీ స్వల్పంగా (లీటరుకు రూ.1–3) తగ్గించి, రిటైల్‌ రేట్ల పెంచే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. రాష్ట్రాల ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో అప్పట్నుంచి రోజువారీగా రేట్ల పెంపు మళ్లీ మొదలు కావచ్చు‘ అని తెలిపింది. మరికొన్ని వర్గాలు రేట్ల పెంపు రూ. 6–10 స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో తుది విడత పోలింగ్‌ ఫిబ్రవరి 7న ముగియనుండగా, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.  

సాధారణంగా ఆయిల్‌ కంపెనీలు.. పెట్రోల్‌ రేట్లను రోజువారీ ప్రాతిపదికన మారుస్తుంటాయి. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 118 రోజులుగా పెంచలేదు. ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 95.41, డీజిల్‌ రేటు రూ. 86.67గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్‌ డ్యూటీ, వ్యాట్‌ రేటును కొంత తగ్గించడంతో ఈ రేట్లు అమలవుతున్నాయి. లేకపోతే పెట్రోల్‌ ధర ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయి రూ. 110.04, డీజిల్‌ రేటు రూ. 98.42గా ఉండేది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు గతేడాది అక్టోబర్‌ 26న 86.40 డాలర్ల గరిష్ట స్థాయికి చేరినప్పుడు దానికి అనుగుణంగా ఈ రేట్లను సవరించారు.

రూపాయికి చమురు సెగలు
అంతర్జాతీయంగా బ్యారెల్‌ చమురు ధర 110 డాలర్లకు చేరుకోవడం ఫలితంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణిస్తోంది. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధ అనిశ్చితుల నేపథ్యంలో భగ్గుమన్న చమురు ధరలతో భార త్‌ దిగుమతుల బిల్లు మరింత భారంగా మారుతోంది. తద్వారా కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతుందనే భయాలతో రూపాయి ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రూపాయి బుధవారం 47 పైసలు పతనమై 75.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 53 పైసలు నష్టపోయి 75.86 కనిష్టాన్ని తాకింది.  

రష్యా ఎఫెక్ట్‌ ..
అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 10 శాతం వరకూ ఉంటుంది. యూరప్‌లో సహజ వాయువు ఉత్పత్తిలో మూడో వంతు వాటా రష్యాదే. భారత్‌ దాదాపు 85 శాతం క్రూడాయిల్‌ అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ .. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో రష్యా నుంచి కేవలం 43,400 బ్యారెళ్లు (మొత్తం చమురు దిగుమతుల్లో సుమారు 1 శాతం) దిగుమతి చేసుకుంది.

రష్యా నుంచి బొగ్గు దిగుమతులు 1.8 మిలియన్‌ టన్నులుగా (మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం) ఉంది. రష్యా నుంచి భారత్‌ 2.5 మిలియన్‌ టన్నుల ద్రవీకృత సహజ వాయువు కూడా దిగుమతి చేసుకుంది. భారత్‌ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాల నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తోంది. కాబట్టి ప్రస్తుతం సరఫరాపరమైన సమస్యలేమీ భారత్‌కు లేవు. కానీ రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్, గ్యాస్‌ తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్, దానికి అనుగుణంగా రేటూ పెరిగిపోతోంది. ఇదే ప్రస్తుతం భారత్‌ను కలవరపర్చే అంశం.

సరఫరా ఉన్నా .. తగ్గని ఆందోళన..
రష్యా నుంచి సరఫరాకు అవాంతరాల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమెరికా సహా అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ)లోని 31 సభ్య దేశాలు తమ దగ్గరున్న నిల్వల్లో 60 మిలియన్‌ బ్యారెళ్ల ఆయిల్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. అయినా క్రూడ్‌ రేటు పరుగు ఆగలేదు. ఫ్యూచర్స్‌ మార్కెట్లో బ్రెంట్‌ ధర బుధవారం ఒక దశలో 6.50% ఎగిసి 111.7 డాలర్లకు చేరింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలోను మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 436 (5.5 శాతం) పెరిగి రూ. 8,341 వద్ద ట్రేడయ్యింది. ఐఈఏ అదనంగా అందించే క్రూడాయిల్‌ ఏ మూలకూ సరిపోదని, రష్యా ఆరు రోజుల్లో 60 మిలియన్‌ బ్యారెళ్లకు మించి ఉత్పత్తి చేస్తుందని అంచనా.

150 డాలర్లకూ పెరగొచ్చు..
అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి ముడిచమురు రేటు 86 డాలర్లకు దిగి రావచ్చని జేపీ మోర్గాన్‌ అంచనా వేస్తోంది. అయితే, రష్యా నుంచి ఇంధన ఎగుమతులు నిల్చిపోతే ధర 150 డాలర్లకు కూడా ఎగియవచ్చని పేర్కొంది. ‘స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆయిల్‌ సరఫరా పూర్తిగా నిల్చిపోతే (ఇరాన్‌ ఎగుమతులు మళ్లీ పునరుద్ధరించి, వ్యూహాత్మక చమురు నిల్వలను వాడుకుంటే పాక్షికంగా తగ్గవచ్చు) ముడి చమురు రేటు బ్యారెల్‌కు 150 డాలర్లకు పెరగొచ్చు. అలా కాకుండా ఇంధన లావాదేవీలను వదిలేసి.. ఆంక్షలను మిగతా విభాగాలకే పరిమితం చేస్తే మాత్రం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో రేటు సగటున 110 డాలర్ల స్థాయిలో తిరుగాడవచ్చు. అప్పుడప్పుడు 120 డాలర్ల స్థాయినీ తాకుతుండవచ్చు‘ అని జేపీ మోర్గాన్‌ పేర్కొంది.  

ఉత్పత్తి పెంపుపై ఒపెక్‌ మల్లగుల్లాలు..
ఇంధన కొరత పరిస్థితిని చక్కదిద్దేందుకు చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌ దృష్టి పెట్టింది. ఉత్పత్తిని ఎంత మేర పెంచాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. రేటు పెరగడమనేది ఉత్పత్తి దేశాలకు లాభదాయకమే అయినప్పటికీ దీనివల్ల వినియోగ దేశాలపై భారం పెరిగి అవి మాంద్యంలోకి జారుకుంటే, ఆయిల్‌కు డిమాండ్‌ పడిపోయే ప్రమాదం కూడా ఉందనే అభిప్రాయం నెలకొంది. ఒపెక్‌ దేశాలు చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టఫ్ట్స్‌ యూనివర్సిటీలోనిక్లైమేట్‌ పాలసీ ల్యాబ్‌ ఎండీ అమీ మయర్స్‌ అభిప్రాయపడ్డారు. అటు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యాకు భారీగా ఇంధనం అవసరం అవుతుంది కాబట్టి అది ఎక్కువగా ఎగుమతులు కూడా చేయలేకపోవచ్చని ఆమె తెలిపారు. అలాంటప్పుడు ఆ కొరతను ఎవరు భర్తీ చేస్తారన్నది కూడా ఆలోచించాల్సిన అంశమన్నారు. ప్రస్తుతానికైతే సౌదీ అరేబియాకు భారీ  ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement