
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి. తగ్గని యుద్ధ భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం కొద్ది సేపుల లాభాలు కనిపించినా ఆ వెంటనే నష్టాలు వెంటాడాయి. మరోవైపు రేపటితో ఫ్యూచర్స్, ఆప్షన్స్ గడువు తీరిపోతుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. పైగా మార్కెట్‌లో హెవీ వెయిట్ కలిగిన రిలయన్స్, ఐటీసీ, ఎల్ అండ్ , బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 54 వేలు, నిఫ్టీ 16 వేల పాయింట్ల దిగువకు పడిపోయాయి. అయితే మార్కెట్ మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మరోసారి సెన్సెక్స్, నిఫ్టీలు కీలక బెంచ్‌మార్క్‌లను నిలబెట్టుకోగలిగాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 54,544 పాయింట్లతో లాభాలతో ఆరంభమైనా ఆ వెంటనే నష్టాలు పలకరించాయి. వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది సెన్సెక్స్. ఒక దశలో 53,519 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 226 పాయింట్లు నష్టపోయి 54,088 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 72 పాయింట్లు నష్టపోయి16,167 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment